
ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): తనను మోసం చేశాడని మండలంలోని చౌటపల్లిలో ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన ప్రియురాలి నిరసన ఆదివారం శృతిమించటంతో గందరగోళం నెలకొంది. చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తనను మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన పూజ అతని ఇంటి ఎదుట నిరసనకు దిగింది. కాగా రెండ్రోజుల క్రితం ఎవరూ లేకపోవటంతో ఆమె నిరసన విరమించింది.
తిరిగి ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట మరోసారి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరింది. తన నిరసనను ఎవరైనా అడ్డుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. దీంతో చుట్టు పక్కలవారు, ప్రియుడి బంధువులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన తరుణంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
అలాగే ఆమె ప్రతి ఘటించటంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో నిరసనకు దిగిన ప్రియురాలిని జవాన్ బంధువులు చితకబాదినట్లు సమాచారం. కత్తి తీ సుకుని రావటంతో ఆమెను ఆడ్డుకున్న తరుణంలో ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారం.
కాగా ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, దీనికి గల పూర్వపరాలు పరిశీలించి కేసు దర్యాప్తు చే స్తామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. కాగా బాధితురాలు గతంలోనే తనను మోసం చేశాడన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.