
సాక్షి, సూపర్‌బజార్(ఖమ్మం): రాజకీయ అండతో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే యత్నం చేస్తున్నారనే ఆవేదనతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పక్కనే ఉన్నవారు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి బండి హైమావతి తల్లి సరళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని రామవరం 7వ నంబర్ బస్తీకి చెందిన సరళ భర్త మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది.
వీరి ఇంటిపక్కనే ఉన్న వంద గజాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోత్కూరి ధర్మారావు అండతో అజయ్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేస్తుండగా, రామవరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ స్థల ఆక్రమణకు యత్నించడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణికి సరళ తన చిన్నకుమార్తె హైమావతితో వచ్చింది.
అప్పటికి ప్రజావాణి ప్రారంభం కాకపోగా ఆవేదనతో హైమావతి తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్త, మరికొందరు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు.
చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment