Homesick
-
హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తొట్టంబేడు: ఇంట్లోవాళ్లకు దూరంగా హాస్టల్లో ఉండలేక, ఆపై చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని తెలుగుగంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె చైతన్య (19) శనివారం శివనాథపాలెం వద్ద కాలువలో దూకింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. ఎస్ఐ రాఘవేంద్ర కథనం మేరకు.. చైతన్య నెల్లూరు జిల్లాలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఈసీఈ చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఇంటిపై ప్రేమ, చదువు ఒత్తిడి, హాస్టల్లో వసతుల కొరతతో ఉండలేనని పలుమార్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ‘లేదమ్మా.. ఈ ఏడాది అక్కడే ఉండి చదువుకో.. హాస్టల్‌కు రూ.50 వేలు చెల్లించా..’ అని తండ్రి నచ్చజెప్పాడు. ఈ క్రమంలో చైతన్య శుక్రవారం ఇంటికి వచ్చింది. శనివారం నూతన సంవత్సరం సందర్భగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లొచ్చింది. కళాశాలకు వెళ్లనని మళ్లీ చెప్పడంతో తల్లిదండ్రులు సర్దిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన చైతన్య శివనాథపాలెం వద్ద తెలుగుగంగ కాలువ ఒడ్డున సెల్‌ఫోన్‌ను పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీడీకాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆ సెల్‌ఫోన్ దొరకడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు శనివారం రాత్రంతా మృతదేహం కోసం గాలించినా లభ్యం కాలేదు. శివానాథపాలేనికి సమీపంలో ఆదివారం చైతన్య మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
బెంగళూరు భామ
తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లా మారిపోయారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ మూడు భాషల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారామె. ఒక సినిమా లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు ప్రయాణం చేస్తూ ఇంటికి వెళ్లడానికి కూడా తీరక దొరకడం లేదంటున్నారు ఈ బెంగళూరు బ్యూటీ. ‘‘నేను నటిస్తున్న ఒక్కో సినిమా షూటింగ్ ఒక్కో చోట జరుగుతుంది. అందుకే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటున్నాను. కన్నడ చిత్రం ‘పొగరు’ షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో వేరే సినిమా. ఆ తర్వాత రాజమండ్రి వెళ్తాను. ఆ తర్వాత పొల్లాచ్చి. వచ్చే నెలలో యూరప్‌లో ఒక నెల షూటింగ్ చేయబోతున్నాను. ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాను’’ అని తన షూటింగ్ షెడ్యూల్ వివరాలు చెప్పారు రష్మిక. అంతేకాదు గత ఆరు నెలల్లో రష్మిక తన ఇంట్లో గడిపింది 22 గంటలేనట. ఇంటిని ఎంత మిస్ అవుతున్నారో చెబుతూ – ‘‘తీరక లేకుండా పని చేస్తున్నాను. ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను. ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలనుంది. ప్రస్తుతం అదొక్కటే కోరుకుంటున్నాను. మొన్న ఇంటి నుంచి వచ్చేస్తుంటే మళ్లీ ఎప్పుడొస్తావు? అని మా చెల్లి అడిగింది. తను పెరిగి పెద్దదవుతోంది. తనతో ఉండటాన్ని మిస్ అవుతున్నాను. ఎప్పుడూ సూట్‌కేస్ రెడీగా పెట్టుకొని తిరుగుతున్నాను’’ అన్నారు రష్మిక. -
నాన్న కళ్లలో వెలుగు!
కనువిప్పు మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. కేవలం మా నాన్న జీతం డబ్బులే మాకు ఆధారం. అందుకే నాన్న ‘‘ఒరేయ్...నేను పెద్ద చదువులు చదువుకోలేదు. దాంతో, ఇలా చిన్న ఉద్యోగమేదో చేస్తూ నానా కష్టాలు పడుతున్నాను. నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. బాగా చదవాలి. పెద్ద చదువులు చదవాలి. నీ చదువు కోసం ఇల్లు కూడా అమ్మేస్తాను’’ అనేవారు తరచుగా. ‘‘అలాగే నాన్న’’ అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవాడిని. అప్పుడప్పుడూ ఆయన మాటలు నాకు చాదస్తంగా అనిపించేవి కూడా. నాకు పాలిటెక్నిక్ కాలేజీలో సీటు రావడంతో, ఊరికి దూరం కావాల్సి వచ్చింది. ‘‘నువ్వు తరచుగా ఇంటికి రావద్దు. చదువు దెబ్బతింటుంది. నీకు డబ్బులు అవసరమైతే ఒక్క ఫోన్ చెయ్ చాలు. పంపిస్తాను’’ అన్నారు నాన్న. మొదట్లో హోమ్సిక్గా అనిపించినా, కొత్త స్నేహాలు పెరగడంతో అక్కడ అలవాటైపోయింది. ఫ్రెండ్స్‌తో షికార్లు చేయడం ఎక్కువైంది. ఫ్రెండ్స్ ముందు గొప్ప కోసం ‘‘మాకు ఊళ్లో చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా నాన్న ఎంతంటే అంత డబ్బు పంపిస్తాడు’’ అని కోతలు కోసేవాడిని. ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ‘దానకర్ణ’ అనే బిరుదు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడిని. ఒకరోజు నాన్న ‘‘ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నావురా?!’’ అని అడిగారు కూడా. నేను ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను. ఒకరోజు... ఆరోజు మా రూమ్‌లో పార్టీ చేసుకుంటున్నాం. ఇంతలో తలుపు చప్పుడైంది. తీసి చూస్తే... నా గుండె ఆగినంత పనైంది! నాన్న!!! ‘‘ఫరావాలేదురా... బాగా కష్టపడుతు న్నావ్’’ అన్నారు వ్యంగ్యంగా నాన్న. ఆ క్షణంలో నేను చనిపోతే బాగుండునని అనిపించింది. నాతో పాటు పార్టీలో కూర్చున్న ఫ్రెండ్స్‌కు కూడా నాన్న వేడిగా క్లాస్ తీసుకున్నారు. ‘‘నాయనలారా... వీడికి పెళ్లి కావాల్సిన అక్క ఉంది. ఆ అమ్మాయి పెళ్లి గురించి కంటే వీడి చదువు గురించే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చాను. మంచిగా బుద్ధి చెప్పాడు’’ అన్నారు నాన్న కన్నీళ్లు తుడుచుకుంటూ. నేను నాన్న కాళ్లు గట్టిగా పట్టుకొని ఏడ్చాను... ఆ కన్నీళ్లతో నా మనసులో ఉన్న చెడు కొట్టుకుపోయేలా! ‘‘నేను మారతాను’’ అని ఆ రోజు చెప్పలేదు. మారి చూపించాను. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. నాన్న కళ్లలో వెలుగు నింపాను. - వి.ఆర్, ఖమ్మం