ఒక్క క్లిక్‌తో ఇంటికి అనుమతి
సరళ పద్ధతుల్లో నూతన భవన నిర్మాణ పాలసీ
జీహెచ్‌ఎంసీపై సమీక్ష అనంతరం మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర సంస్థల నుంచి పొందాల్సిన అనుమతులు, అధికారులకు ‘ఆమ్యామ్యాలు’ వంటి దశలను దాటితేగానీ మహాయజ్ఞం లాంటి ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం సాధ్యంకావట్లేదు. ఈ దుస్థితి లేని వ్యవస్థ అందుబాటులోకి వస్తే... అధికారులకు చేయి తడపాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క మౌస్ క్లిక్‌తో క్షణాల్లో గృహ నిర్మాణానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో సరళ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తోంది. అక్రమ కట్టడాలు, లే అవుట్‌ల క్రమబద్ధీకరణతోపాటు నూతన భవన నిర్మాణ పాలసీ రూపకల్పన అంశంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో నూతన భవన నిర్మాణ పాలసీపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో భవన నిర్మాణ అనుమతులన్నీ వచ్చేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం అమలు చేస్తున్న ‘టీఎస్-ఐపాస్’ విధానం తరహాలోనే భవన నిర్మాణ విధానం ఉంటుందన్నారు.
ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నగరంలో చాలా అక్రమ కట్టడాలున్నాయని, నాలాలపైనా నిర్మాణాలున్నాయని, దేవాలయస్థలాలను సైతం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని కన్జర్వేటివ్ జోన్‌లో అనుమతులు లేకపోయినా నిర్మాణాలు జరిగాయన్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో తప్పులు పునారావృతం కాకుండా ఉండేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసేలా నూతన పాలసీ ఉంటుందన్నారు. దీని ద్వారానే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు జరిగితే ఆ ప్రాంత అధికారినే బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరానికి ఇప్పటికే రూ. 230 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటికి ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీద చెత్త పారబోయకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతీ ఇంటికీ రెండు డస్టుబిన్లు ఇవ్వనున్నట్లు తలసాని చెప్పారు. పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రణాళికపై తమ కమిటీ సెప్టెంబర్ 1న మరోసారి సమావేశమై నెల రోజుల్లో సీఎం కే సీఆర్‌కు నివేదిక ఇస్తుందన్నారు. జీవో 111కు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, అక్కడ కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఈ సమస్యలకు ఇక చెక్
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పలు సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకూ ఇంటిని నిర్మించాలంటే ఈ పాట్లన్నీ పడాల్సి వచ్చేది. నగర పాలక సంస్థ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి విధిగా పొందాలి. ఇందుకు ఇళ్లు నిర్మించాల్సిన స్థలం తాలూకా అన్ని లింక్ డాక్యుమెంట్లను సమర్పించాలి. అంతేకాదు టౌన్‌ప్లానింగ్ అధికారుల తనిఖీలు, వాళ్లకుఇవ్వాల్సిన ‘మామూళు’్ల షరామామూలే. డాక్యుమెంట్లన్నీ సరిగానే ఉన్నా...మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. నిర్మాణ అనుమతికి లోబడి మాత్రమే భవనంలో అంతస్తులు నిర్మించాలి. విద్యుత్,మంచినీటి కనెక్షన్ పొందాలంటే లింక్ డాక్యుమెంట్లు, సేల్‌డీడ్‌లు తప్పనిసరి. బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలంటే ఫైర్‌సేఫ్టీ అనుమతులు, సెట్‌బ్యాక్‌లు(భవంతి చుట్టూ ఖాళీస్థలాలు) తప్పనిసరి.
200 చదరపు మీటర్ల విస్తీర్ణం మించిన భవనానికి సంబంధించిన స్థలంలో నిర్మాణ వైశాల్యంలో పదిశాతం స్థలాన్ని మున్సిపాల్టీకి తనఖా పెట్టాలి. టౌన్‌ప్లానింగ్ అనుమతుల ప్రకారమే ఇంటిని నిర్మించినట్లు ధ్రువీకరిస్తేనే భవంతి నిర్మాణం తరవాత ఆక్యుపెన్సీ ధ్రువీకరణ మంజూరు చేస్తారు.గృహనిర్మాణ అనుమతికి దరఖాస్తుతోపాటు రూ.10 వేలు డీడీని సమర్పించాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి అనుమతులకు చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది.
ఇంటిని నిర్మిస్తున్న లేఅవుట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్(ఎల్‌ఆర్‌ఎస్)ధ్రువీకరణ ఉంటేనే ఇంటిరుణం దొరికే పరిస్థితి ఉంది. గతంలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన వారు ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాల ప్రకారం బిల్డింగ్ పీనలైజేషన్(బీపీఎస్) పథకం కింద భవంతిని క్రమబద్దీకరించుకోవాలి. పదిమీటర్ల ఎత్తుకు మించిన భవనానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవీ... భవన నిర్మాణ దరఖాస్తుపై ఇంటి యజ మాని సంతకం, బిల్డర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల సంతకాలు. ఓనర్ డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్. భవన ఆర్కిటెక్ట్ లేదా ఇంజ నీర్ లెసైన్సు కాపీ. ఎమ్మార్వో జారీ చేసే టౌన్ సర్వే రికార్డు. గతంలో జారీచేసిన అనుమతి పత్రం. వెయ్యి చదరపు మీటర్లు దాటిన భవంతికి యూఎల్‌సీ క్లియరెన్స్. వెయ్యి చదరపు మీటర్ల లోపలున్న భవంతికి యూఎల్‌సీ అఫిడవిట్. ఓనర్‌షిప్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు. రూ. 20 నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్. భవన నిర్మాణ ప్లాన్.