
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీరాంసాగర్, కోయిల్‌సాగర్, మిడ్‌మానేర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో చేపల పెంపక కేంద్రాలు, ల్యాండింగ్ సెంటర్లు, ఫీడ్‌మిల్లులు, చేపల మార్కెట్ల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి(ఎన్‌ఎఫ్‌డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి రాణికుముదినిదేవి తెలిపారు. బుధవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలసి మాట్లాడారు. జంట నగరాల్లోని 150 డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నాణ్యమైన చేపల ఆహారం, అమ్మకానికి సంబంధించిన మొబైల్ ఔట్‌లెట్లకు ఎన్‌ఎఫ్‌డీబీ సహకారం అందిస్తుందన్నారు.
పాత జిల్లాల్లో 40 చేపల మార్కెట్లు
పాత 10 జిల్లాల్లో 40 చేపల మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాల నిర్వహణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. 2018–19 ఏడాదిలో 24,192 నీటి వనరుల్లో 77 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తామని, టెండర్ల ప్రక్రియ సాగుతుందని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది కోటి రొయ్య పిల్లలను పంపిణీ చేశామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతోప్రణాళికలను రూపొందించామన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment