అది మహారాష్ట్రలోని ఎగువ మధ్య తరగతి కుటుంబం. పిల్లల అవసరాలను తీర్చడానికి, ఆసక్తులను నెరవేర్చడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ తలెత్తని సౌకర్యవంతమైన జీవితం వారిది. ఒకరోజు ఆ ఇంట్లో పాపాయి ‘‘నాన్నా! నాకు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం కావాలి, కొనివ్వవా’’ అంటూ గారాలు పోయింది. ఆ పుస్తకం మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం రాసుకున్న జీవిత చరిత్ర. ఆ అమ్మాయి అప్పటికే కలాం వంటి ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రలను చదివింది. ఆమె పుస్తకాల అలమరాలో ఒక అర క్లాసు పుస్తకాలతో నిండి ఉండే మూడు అరల్లో పిల్లలు చదివి తీరాల్సిన పుస్తకాలే ఉంటాయి.
కూతురి మాట పూర్తయ్యేలోపే ‘‘అలాగే కొనిస్తాను బంగారు తల్లీ’’ అన్నాడా తండ్రి మురిపెంగా. తాను చదవమని సూచించడానికంటే ముందే కూతురు అంత గొప్పవాడి జీవితచరిత్రను చదవాలని అడగడం ఆ తండ్రిని ఎక్కువగా సంతోష పెట్టింది. దాంతోపాటే మరో ఆలోచన కూడా వచ్చిది. ఎంతోమంది పిల్లలు నగరాల్లోని మురికివాడల్లో, గ్రామాల్లో నిరుపేద కుటుంబాల్లో జీవిస్తూ క్లాసు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేక చిరిగిపోయిన పుస్తకాలతో సరిపెట్టుకుంటున్నారు.
అలాంటి పిల్లలకు మంచి సాహిత్యం అందడం ఎలా? అని. పిల్లలకు తిండి, బట్ట సమకూర్చడమే కష్టమయ్యే కుటుంబాల్లో సాహిత్యం కోసం డబ్బు ఖర్చు చేయలేరు. మారుమూల గ్రామాల్లో కొన్ని కలిగిన కుటుంబాల పిల్లలకు పుస్తకాల కొనగలిగిన ఆర్థిక స్తోమత ఉన్నా, ఎలా తెప్పించుకోవాలో తెలియదు. దీనికి పరిష్కారంగా రూరల్ లైబ్రరీకి శ్రీకారం చుట్టారు ప్రదీప్ లొఖాండే.
మహారాష్ట్రలోని పుణేలో నివసించే ప్రదీప్ లొఖాండే గ్రామీణ గ్రంథాలయాల స్థాపనలో వినూత్నమైన శైలిని అనుసరించారు. భారీ వ్యయంతో లైబ్రరీలను స్థాపించి, వాటి నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం తన శక్తికి మించిన పని. కానీ గ్రామాల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ లైబ్రరీ ఉండాలి, అందులో మంచి పుస్తకాలు ఉండాలి.
బాధ్యతాయుతంగా నిర్వహించే వారిని ఇందులో భాగస్వాములను చేయాలి... అనుకున్నారు. మొదట పుణే పరిసర గ్రామాలతో మొదలు పెట్టారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి తమ ప్రయత్నాన్ని వివరించి తన అడ్రస్ రాసిన పోస్టు కార్డులు పంచారు. స్కూలు లైబ్రరీ లేనివారు మంచి పుస్తకాల కోసం ఆ కార్డు మీద రాసి పోస్టు చేయమని కోరారు. అడిగిన వారికి అడిగినట్లు పుస్తకాలను పేదవారికి సొంతఖర్చులతో పంపించారు. కొనుక్కోగలిగిన వారికి ఎలా తెప్పించుకోవాలో తెలియచేస్తూ మరో ఉత్తరం రాసేవారు. అలా తన సేవలను ఇప్పటికి వెయ్యికి పైగా గ్రామాలకు విస్తరించారు ప్రదీప్ లొఖాండే. మూడు లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. ఇంకా కావాలనే వారికి పుస్తకాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఒక వినూత్నమైన ఆలోచన విశేషమైన విజయాన్ని తెచ్చిందంటారు ప్రదీప్ లొఖాండే. తన పుస్తకాలు అందుకున్న వారిలో దాదాపుగా 50 వేల మంది విద్యార్థులు ఆ పుస్తకాలను చదివి తమ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా పంచుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తారాయన. మహారాష్ట్రలోని 5,800 లైబ్రరీలకు పుస్తక పంపిణీ చేశాక దేశంలో ఉన్న 85 వేల లైబ్రరీలకు తన సేవలను విస్తరించాలని ఉందని, అదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమనీ అంటారు ప్రదీప్ లొఖాండే. పుస్తకాలు కావాలంటే ఒక ఉత్తరం రాయమంటూ కొత్తగా పరిచయమైన వారందరికీ తన అడ్రస్ రాసిస్తారు. సామాజిక, సాహిత్య సేవలకు ఇదో వినూత్నమైన ఆలోచన.
ఉత్తరం రాస్తే... విజ్ఞాన వీచికలు వీస్తాయి!
Published Wed, Jul 2 2014 12:25 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement