ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలను ముంబై పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో అతనితోపాటు, నలుగురు సహాయకులను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. శివకుమార్‌ను విచారించిన సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్న విషయాలు, మిస్టర్ సిద్ధిఖీని చంపిన తర్వాత ఎలా పారిపోయాడనే విషయాలను నిందితుడు శివకుమార్ పోలీసులకు వివరించాడు. కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీని కాల్చివేయమని అన్మోల్ బిష్ణోయ్ తమకు ఆదేశించాడని శివకుమార్ చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ముందు ఎవరిని చూసినా కాల్చేయండి’ అని అన్మోల్ శివకుమార్‌తో చెప్పాడని తెలిపారు.
సిద్ధిఖీ హత్యకు ముందు.. కెనడాలో ఉన్న ఎన్‌ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రధాన నిందితుడు శివ కుమార్ టచ్‌లో ఉన్నాడని తెలిపారు. ‘దేవుడు, సమాజం’ కోసం తాను ఏం చేయబోతున్నానో.. అన్మోల్ తనతో చెప్పాడని శివకుమార్ చెప్పినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అయితే.. సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురిలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో జీషన్ సిద్ధిఖీ ఫొటో కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ప్రధాన నిందితుడు శివ కుమార్ గౌతమ్ వెంటనే బట్టలు మార్చుకొని అదృశ్యం అయ్యాడని. అతన్ని ఎవరూ గుర్తించలేదని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలం నుంచి కుర్లాకు ఆటోలో ప్రయాణించి.. అక్కడి నుంచి థానేకు లోకల్ రైలు ఎక్కినట్లు తెలిపారు. థానే నుంచి రైలులో పూణెకు వెళ్లి ప్రయాణంలో తన మొబైల్ ఫోన్‌ను పారేశాడని చెప్పారు. ఇక.. శివ కుమార్ సుమారు ఏడు రోజుల పాటు పూణేలో ఉండి, ఆపై రైలులో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్లారు.
ఆ తర్వాత ఐదు రోజుల పాటు అక్కడే ఉండి రాష్ట్ర రాజధాని లక్నో చేరుకున్నాడు. లక్నోలో కొత్త మొబైల్ కొని తన సహాయకులను సంప్రదించాడు. అక్కడ 11 రోజులు గడిపిన తర్వాత, అతను తన స్వస్థలమైన బహ్రైచ్‌కు వెళ్లి తన సహాయకులను కలుసుకున్నాడు. దీంతో వారు సమీపంలోని గ్రామంలో అతనికి భద్రత కల్పించారని పోలీసులు వెల్లడించారు. ఇక.. దేశం విడిచి పారిపోయే ముందు అతను మొదట మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వెళ్లి, ఆపై జమ్మూలోని వైష్ణో దేవికి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.
ఆదివారం నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను బహ్రైచ్‌లో అతని నలుగురు సహాయకులతో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 12న ముంబైలో సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురు షూటర్లలో శివకుమార్ కూడా ఉన్నాడు. అయితే.. హర్యానా నివాసి గుర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేయగా.. శివ కుమార్ పారారైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment