Wings of Fire
-
నిబద్ధతను గుర్తించడమూ నిబద్ధతే!
రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆర్. వెంకట్రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌లు (APJ Abdul Kalam) ఆ స్థితికి చేరడానికి ఎంతటి అర్హులో చెప్పే అరుదైన సంఘటన ఇది. 1983లో అబ్దుల్ కలామ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించే రోజుల్లో రక్షణ మంత్రిగా ఆర్. వెంకట్రామన్ (R. Venkataraman) ఉన్నారు. దేశ సంరక్షణ కోసం స్వదేశీ రీసెర్చ్ ద్వారా క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణం చేపట్టాలని భారత ప్రభుత్వం ‘మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కమిటీ’ని నియమించింది. ఇందులో కలామ్ అధ్యక్షునిగా, ఐదుగురు అనుభవజ్ఞులైన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నారు. త్రివిధ దళాలకు ఉపయోగపడే క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణానికి కావలసిన బడ్జెట్ వివరాల నమూనా (బ్లూ ప్రింట్) తయారు చేసే బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పింది రక్షణ శాఖ. పలు చర్చలు, తర్జన భర్జనలు జరిపిన అనంతరం, కమిటీ పది సంవత్సరాల కాలవ్యవధి, రూ. 390 కోట్ల బడ్జెట్‌తో ఒక డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసింది.రక్షణ మంత్రి, త్రివిధ దళాల ముఖ్య అధి కారుల సమావేశంలో కలామ్ తమ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వివరించారు. మంత్రి దశల వారీగా కాకుండా ‘సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం’ (ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగాం)ను అతి తక్కువ సమయంలో తయారు చేసే పద్ధతిలో ప్లాన్ తీసుకురావలసిందిగా కోరారు. అది విని సైంటిస్టులు దీనికి కొంత వ్యవధి కావాలని కోరారు. ‘లేదు, లేదు; రేపు సాయంత్రం కేబినెట్ కమిటీ మీటింగు జరగబోతోంది, అందులో మీ ప్రాజెక్టు రిపోర్టు ఉంచాల్సి ఉంటుంది’ అని, మరుసటి రోజు ఉదయం తనను కలవాల్సిందిగా కోరారు వెంకట్రామన్. కలామ్, కమిటీ సభ్యులూ ఆఫీసు చేరుకుని ఆలస్యం చేయకుండా ఆ పనిలో రాత్రంతా తల మునకలయ్యారు. ఎప్పుడు తెల్ల వారిందో తెలీనేలేదు. మొత్తానికి మంత్రి కోరినట్టుగానే రిపోర్టు తయారు చేశారు.ఉదయం ఇంటికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ టేబిల్ దగ్గర కూర్చున్నాక గుర్తుకొచ్చింది కలామ్ గారికి, ఆరోజు జుమ్మేరాత్; ఆయన అన్న కూతురు జమీలాది ‘నిఖా’ అన్న సంగతి! అదీ ఢిల్లీలో కాదు, దక్షిణాది రామేశ్వరంలో! వృత్తి ఒత్తిడి రీత్యా కుటుంబ బాధ్యతలు విస్మరించడం ఎంతవరకు సబబు? ఇది ఆయన మనసును కలచి వేసింది. కాని ఇవ్వాళ, ఆమె పెళ్లికి తను హాజరు కాలేని నిస్సహాయ పరిస్థితి! బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని, తన టీమ్‌తో సౌత్ బ్లాక్ చేరుకుని, రాత్రి సవరించిన ప్రాజెక్టు రిపోర్టును మంత్రి వెంకట్రామన్కి చూపించారు డాక్టర్ కలామ్. దాన్ని సావధానంగా వీక్షించి తను సూచించిన విధంగానే తయారవటంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆయన, ‘ఇలాంటి క్లిష్టమైన జాబ్ మీతోనే సాధ్య పడుతుంది అనే నమ్మకంతోనే మిమ్మల్ని డీఆర్డీఓ డైరెక్టర్‌గా నియమించా కలామ్‌జీ’, అని నవ్వుతూ ఆయన భుజం తట్టి, ఇక వెళ్దాం అన్నట్టు కుర్చీలో నుండి లేచి నిలుచున్నారు వెంకట్రామన్. తోటి సభ్యులు ఛాంబర్ నుండి వెళ్ళే ముందు డాక్టర్ అరుణాచలం (టీం సభ్యుడు) మంత్రి గారితో, ‘ఇవ్వాళ సాయంత్రం రామేశ్వరంలో కలామ్ అన్నగారి అమ్మాయి పెళ్ళి’ అనటంతో, కలామ్ వైపు ఆశ్చర్యంగా నఖశిఖ పర్యంతం చూశారు మినిస్టర్. కాసేపటికి తేరుకుని, తన పర్సనల్ సెక్రటరీని పిలిచి అర్జంటు సూచనలు కొన్ని చేశారు. ఢిల్లీ విమానా శ్రయం నుండి మద్రాసుకు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ మరో గంటలో వెళ్లనుంది. కావలసిన బ్యాగేజ్‌తో రామేశ్వరం చేరుకోవటానికి వెంటనే ఎయిర్పోర్ట్ చేరుకోవలసిందిగా కలామ్‌కు చెప్పారు మంత్రి పీఏ. ఈసారి ఆశ్చర్యంలో మునగటం డాక్టర్ కలామ్ వంతైంది.విమానం మద్రాసు రన్ వేపై దిగినవెంటనే ప్రక్కనే ఆయన కోసం వేచి ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఆయన్ని తీసుకుని మదురైకి బయలుదేరింది. అక్కడ ఎయిర్‌ఫోర్స్ కమాండెంటు తన వాహనంలో ఆయన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. మదురైనుండి రామేశ్వరం బయల్దేరే ట్రెయిన్‌ను కలామ్ వచ్చే వరకు ఆపాలని, ఉదయమే రాష్ట్రపతి కార్యాలయం నుండి మదురై రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు సూచనలు అందాయి. అంతే... కలామ్ రావటంతో ఆయనను రిసీవ్ చేసుకుని ట్రెయిన్లో కూర్చో బెట్టారు రైల్వే ఉన్నత అధికారులు. 175 కి.మీ. దూరం రామేశ్వరం. చదవండి: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు!ఆ ట్రెయిన్ మూడు గంటల్లో గమ్యం చేరటంతో జమీలా పెళ్ళి ముహూర్తానికి చేరుకున్నారు కలామ్ సాబ్. అనుకోని ఆయన రాకతో ఆ కుటుంబంలో సంతోషం రెండింతలైంది. ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే ముందు, తన సహచరుడు డాక్టర్ అరుణాచలం ‘గత ఆరు నెలలుగా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇది’ అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి కలామ్‌కు. ఎంతనిజం! తన వృత్తి పట్ల చూపిన నిబద్ధతకు రక్షణమంత్రి బహుశా ఇది తనకు ఇచ్చిన బహుమతి కాబోలు అనుకున్నారు కలామ్ సర్. తర్వాత కాలంలో వీరిద్దరూ రాష్ట్రపతి పీఠం అధిరోహించటం గమనార్హం!- జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (డాక్టర్ అబ్దుల్ కలామ్ ఆత్మ కథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ఆధారంగా)(జనవరి 27న మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ వర్ధంతి) -
దివ్యాంగ విజయాలు.. వింగ్స్ ఆఫ్ ఫైర్..!
అవయవలోపం ఉన్నా అనితరసాధ్య విజయాలు సాధించడంలో మిన్నగా నిలిచిన దివ్యాంగులకు అభినందన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పంచుకున్న క్రీడానుభవాలు అందరి మనసుల్నీ స్పర్శించాయి. గృహనిర్మాణానికి పేరొందిన జీ స్క్వేర్ హౌసింగ్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్లో వింగ్స్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పేరొందిన పారా అథ్లెటిక్స్ను నగదు బహుమతులతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో దివ్యాంగుల విజయాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తాయని సీఆర్పీఎఫ్ డిఐజీ అనిల్ మింజ్ అన్నారు. పారా అథ్లెట్స్‌కు సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న రంగాల్లో రాణించేందుకు అన్ని వర్గాల వారూ తమ వంతుగా ప్రోత్సాహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి.సాయి ప్రణీత్ మాట్లాడుతూ క్రీడారంగంలో ఎదురయ్యే సవాళ్లు తనకు తెలుసని వీటిని ఎదుర్కుని విజేతలు కావడం ద్వారా దివ్యాంగులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సంస్థ సిఇఒ ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల విజయాలకు తోడ్పడేందుకు వచ్చే ఏడాది నుంచి గెలుపొందిన క్రీడాకారులను సన్మానించడం మాత్రమే కాకుండా క్రీడల్లో పాల్గొనేవారికి ఆర్ధికంగా సాయం అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నివాసి పారా అధ్లెట్ వేణు తొలి దశలో తనని ఎవరూ ప్రోత్సహించేవారు కాదనీ చెబుతూ తానెలా అడ్డంకుల్ని అధిగమించి విజేతగా నిలిచాడో వివరించారు. అదే విధంగా భాగ్యశ్రీ మాథవ్ రావు జావెద్ మాట్లాడుతూ తన అనుభవాలు వివరించారు. హై జంప్‌లో పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ తో పాటుగా పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న, అర్జున పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్న మరియప్పన్ తంగవేలు, అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గీరీశ్ చంద్ర జోషి, ఇంటర్నేషనల్ పారా అథ్లటిక్స్ ఛాంపియన్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్, కర్ణాటకకు చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కె. గోపీనాథ్, మేథా జయంత్, తమిళనాడుకు చెందిన స్విమ్మింగ్ ఛాంపియన్ ఎస్ఆర్ తేజస్విని, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్లు బీర్ భద్ర సింగ్, అజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. భాగ్యశ్రీ మాధవరావు జావేద్ లకు రూ.1లక్ష చొప్పున, మరో ముగ్గురికి రూ.75వేల చొప్పున, మరో ముగ్గురు క్రీడాకారులకు 50వేల చొప్పున నగదు బహముతులను అందించడంతో పాటు ఘనంగా సన్మానించారు. -
నీకిచ్చిన మాటమీదే నిలబడ్డానమ్మా...
‘‘నేను నా కుటుంబంలో, సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచిసభ్యుడిగా ఉంటాను’’ అనేది అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన మూడవ ప్రతిజ్ఞ. ‘‘ఇతను మాకు చాలా విలువైన, గొప్ప సభ్యుడు లేదా సభ్యురాలు’’ అని మొట్టమొదట సంతోషించాల్సింది మన కుటుంబమే. ‘ ఈ పిల్ల లేదా పిల్లవాడు మా కొడుకు’’ అని మొదట తల్లిదండ్రులు పరవశించిపోవాలి. అలా వారు సంతోషించడానికి మీరు అన్నివేళలా మీ పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. ‘‘మా పిల్లలు అబద్ధమాడరు. పవిత్ర హృదయంతో ఉంటారు. ఒక లక్ష్యం పెట్టుకుని, చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. ఒకరిని పాడుచేసే లక్షణం మా పిల్లలకు ఎప్పుడూ లేదు’’అని తల్లిదండ్రులు గర్వంగా ప్రకటించుకోగలగాలి. పిల్లలు ఆ విశ్వాసాన్ని వారికి కలిగించాలి. రామాయణంలో రామచంద్రమూర్తిని చూసి తల్లి సంతోషించింది. తండ్రి మురిసి పోయాడు. ‘మా అన్నయ్య ఇంత గొప్పవాడు’ అని తమ్ముళ్ళు పొంగిపోయారు.. ‘రాముడు మా రాజు’ అని చెప్పుకుని ప్రజలు ఆనందపడ్డారు. రాముడు గుహుడితో అంత ప్రేమతో ప్రవర్తించబట్టే ‘రాముడు నా స్నేహితుడు’ అని ఆయన సంతోషపడిపోయాడు. విభీషణుడు రాక్షసుడు, సుగ్రీవుడు వానరుడు. అలాగే ఋషులు...పండితులు, విద్వాంసులు, మంత్రులు... ఇలా రాముడు ఎక్కడుంటే అక్కడి వారందరూ సంతోషించారు. కలాం చదువుకుంటున్న రోజుల్లో మద్రాస్‌లోని ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుకునే అవకాశం వచ్చింది. ఫీజుకట్టడానికి డబ్బుల్లేవు. ఆయన సోదరి జోహ్రా తన గాజులు, గొలుసులు తాకట్టుపెట్టి డబ్బిచ్చింది. కష్టపడి సంపాదించి తాకట్టు నగలు విడిపిస్తానని ఆమెకు మాటిచ్చాడు. కళాశాలలో ప్రవేశించిన తరువాత తన మాట నిలబెట్టుకోవడానికి చాలాకాలం పడుతుందేమోనని అనుమానించి స్కాలర్ షిప్ కోసమని– ‘చదువు’ అన్న మూడక్షరాలు తప్ప నాలుగో అక్షరంతో సంబంధం లేకుండా చదివాడు. అదొక ఉపాసన. అలా కష్టపడ్డాడు. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకం విద్యార్థులు తప్పక చదవాల్సిన పుస్తకం. దానిలో ఆయన ఇవన్నీ వివరించాడు. ఆయన కష్టపడడాన్ని చూసి ఆచార్యులు సయితం ఆశ్చర్యపోయారట. అంటే.. ఇంత సంస్కారం, ఇంత క్రమశిక్షణ ఎలా సాధ్యం ? మీరు మీ కుటుంబంలో మంచి సభ్యుడయితే మీ చుట్టుపక్కల వాళ్ళని, మీరుంటున్న సమాజాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కలాం బాల్యంలో ఒకరోజు వాళ్ళ అమ్మ రొట్టెలు చేసిపెడుతుంటే అవి కమ్మగా ఉన్నాయని అన్నీ తినేసారు. వాళ్ళ అన్నయ్య ‘బుద్ధి ఉందా నీకు, అమ్మకు కూడా లేకుండా అన్నీ తినేసావు..’ అని కోప్పడితే అమ్మకు లేకుండా తిన్నానన్న బాధకొద్దీ కలాం కళ్ళవెంట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. అది చూసి జాలిపడిన అమ్మ కలాంను దగ్గరకు తీసుకుని ‘‘నేను తినాల్సినవి నీవు తిన్నావని బెంగపెట్టుకోకు. నీ కన్నతల్లిగా నేనే కాదు, ఈ దేశమాత కూడా గర్వపడేవిధంగా నీవు ఉత్తమ పౌరుడివి కావాలి’’ అంటూ బుజ్జగించింది. ఈ పుస్తకం ఉపోద్ఘాతంలో కలాం – ‘‘నేను ఈ లోకం వదిలిపెట్టిన తరువాత నీవు ఏ లోకంలో ఉన్నా మొదట వచ్చి నీకే నమస్కరించి.. అమ్మా! నీకు మాటిచ్చినట్లే నా ఆఖరిశ్వాస వరకూ బతికాను..అని చెబుతాను’’–అని రాసుకున్నారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆదర్శం వీరి ఆటో బయోగ్రఫీ
పంచామృతం రాసుకునే ఆసక్తి ఉండాలి కానీ..ప్రతి వ్యక్తికీ ఆత్మకథ రాసేటంతటి జీవితం ఉంటుంది. విజేతలుగా, ప్రముఖస్థాయికి చేరిన వారి జీవిత కథలు అయితే మరింత ఆసక్తికరం. వీరి జీవిత కథలు స్ఫూర్తిమంత్రాలు. ఔత్సాహికులకు ఆదర్శప్రాయాలు. అలాంటి ఆటోబయోగ్రఫీలను ఏ జీవిత చరమాంకంలోనో రాసుకోవడం కాకుండా, ఒకదశలోనే తమ అనుభవాలను పుస్తకంగా రాసుకుని స్ఫూర్తిని పంచుతున్న వారున్నారు. అలాంటి లివింగ్ లెజెండ్స్‌లో కొందరు... అబ్దుల్‌కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’... భారతీయ యువతకు బాగా ఇష్టమైన వ్యక్తి జీవిత కథ ఇది. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం తన ఆత్మకథను ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పేరుతో గ్రంథస్తం చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలోని ఒక సాధారణ కుటుంబం నుంచి తను ఎదిగి వచ్చిన తీరు గురించి అందులో ఆయన వివరించారు. ఈ ఆత్మకథలోని అనేక అధ్యాయాలు అకాడమీ పుస్తకాల్లో పాఠాలుగా కూడా మారాయి. కపిల్‌దేవ్ తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్టీమ్కు కెప్టెన్‌గా, జట్టుకు మరపురాని విజయాలను సాధించి పెట్టిన ఆల్‌రౌండర్‌గా ఈ మాజీ క్రికెటర్ భారతీయులకు ఇష్టుడు. ఆయన పదేళ్ల కిందటే ‘స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్’ పేరుతో ఆత్మకథను రచించారు. కెప్టెన్‌గా తన అనుభవాలను పంచుకొన్నారు. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తుడై టూర్డీ ఫ్రాన్స్ విజేతగా నిలిచిన తర్వాత సైక్లిస్ట్ లాన్స్ఆర్మ్స్ట్రాంగ్ ‘ఇట్స్నాట్ అబౌట్ ద బైక్’ పేరిట ఆత్మకథ రాశాడు. బాల్యం నుంచి తన జీవితంలోని ఆటుపోట్లను అందులో వివరించాడు. ఇది అనేక మంది క్యాన్సర్ బాధితులకు మానసిక బలాన్ని ఇచ్చే పుస్తకంగా మారింది. తర్వాతికాలంలో లాన్స్ జీవితం వివాదాలపాలైంది. ఆండ్రూ అగస్సీ మీకు ఇష్టమైన పుస్తకం ఏమిటి? అంటే, అనేక మంది యువ క్రీడాకారులు ‘ఓపెన్’ అని చెబుతూ ఉంటారు. ఈ పుస్తకం అమెరికన్ టెన్నిస్‌స్టార్ ఆండ్రూ అగస్సీ జీవితసారం. దాదాపు ఐదేళ్ల కిందట అగస్సీ ఈ పుస్తకాన్ని రాశారు. అప్పటి నుంచి ఈ క్రీడాకారుని ఆత్మకథ బెస్ట్‌సెల్లర్ జాబితాలో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. బ్రిట్నీ స్పియర్స్ అమెరికన్పాప్ తరంగం బ్రిట్నీస్పియర్స్ ఆటోబయోగ్రఫీ పేరు ‘హార్ట్ టు హార్ట్’. తన జీవితం, ప్రేమ, ఫేమ్, తన స్వప్నాల గురించి బ్రిట్నీ అందులో వివరించింది. పాశ్చాత్య యవతకు మోడల్‌గా మారింది. పిన్న వయసులోనే ఆత్మకథ రచనకు పూనుకొన్న బ్రిట్నీకి ఈ రచన విషయంలో తల్లి నుంచి కూడా సహకారం లభించిందట. -
ఉత్తరం రాస్తే... విజ్ఞాన వీచికలు వీస్తాయి!
అది మహారాష్ట్రలోని ఎగువ మధ్య తరగతి కుటుంబం. పిల్లల అవసరాలను తీర్చడానికి, ఆసక్తులను నెరవేర్చడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ తలెత్తని సౌకర్యవంతమైన జీవితం వారిది. ఒకరోజు ఆ ఇంట్లో పాపాయి ‘‘నాన్నా! నాకు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం కావాలి, కొనివ్వవా’’ అంటూ గారాలు పోయింది. ఆ పుస్తకం మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం రాసుకున్న జీవిత చరిత్ర. ఆ అమ్మాయి అప్పటికే కలాం వంటి ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రలను చదివింది. ఆమె పుస్తకాల అలమరాలో ఒక అర క్లాసు పుస్తకాలతో నిండి ఉండే మూడు అరల్లో పిల్లలు చదివి తీరాల్సిన పుస్తకాలే ఉంటాయి. కూతురి మాట పూర్తయ్యేలోపే ‘‘అలాగే కొనిస్తాను బంగారు తల్లీ’’ అన్నాడా తండ్రి మురిపెంగా. తాను చదవమని సూచించడానికంటే ముందే కూతురు అంత గొప్పవాడి జీవితచరిత్రను చదవాలని అడగడం ఆ తండ్రిని ఎక్కువగా సంతోష పెట్టింది. దాంతోపాటే మరో ఆలోచన కూడా వచ్చిది. ఎంతోమంది పిల్లలు నగరాల్లోని మురికివాడల్లో, గ్రామాల్లో నిరుపేద కుటుంబాల్లో జీవిస్తూ క్లాసు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేక చిరిగిపోయిన పుస్తకాలతో సరిపెట్టుకుంటున్నారు. అలాంటి పిల్లలకు మంచి సాహిత్యం అందడం ఎలా? అని. పిల్లలకు తిండి, బట్ట సమకూర్చడమే కష్టమయ్యే కుటుంబాల్లో సాహిత్యం కోసం డబ్బు ఖర్చు చేయలేరు. మారుమూల గ్రామాల్లో కొన్ని కలిగిన కుటుంబాల పిల్లలకు పుస్తకాల కొనగలిగిన ఆర్థిక స్తోమత ఉన్నా, ఎలా తెప్పించుకోవాలో తెలియదు. దీనికి పరిష్కారంగా రూరల్ లైబ్రరీకి శ్రీకారం చుట్టారు ప్రదీప్ లొఖాండే. మహారాష్ట్రలోని పుణేలో నివసించే ప్రదీప్ లొఖాండే గ్రామీణ గ్రంథాలయాల స్థాపనలో వినూత్నమైన శైలిని అనుసరించారు. భారీ వ్యయంతో లైబ్రరీలను స్థాపించి, వాటి నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం తన శక్తికి మించిన పని. కానీ గ్రామాల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ లైబ్రరీ ఉండాలి, అందులో మంచి పుస్తకాలు ఉండాలి. బాధ్యతాయుతంగా నిర్వహించే వారిని ఇందులో భాగస్వాములను చేయాలి... అనుకున్నారు. మొదట పుణే పరిసర గ్రామాలతో మొదలు పెట్టారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి తమ ప్రయత్నాన్ని వివరించి తన అడ్రస్ రాసిన పోస్టు కార్డులు పంచారు. స్కూలు లైబ్రరీ లేనివారు మంచి పుస్తకాల కోసం ఆ కార్డు మీద రాసి పోస్టు చేయమని కోరారు. అడిగిన వారికి అడిగినట్లు పుస్తకాలను పేదవారికి సొంతఖర్చులతో పంపించారు. కొనుక్కోగలిగిన వారికి ఎలా తెప్పించుకోవాలో తెలియచేస్తూ మరో ఉత్తరం రాసేవారు. అలా తన సేవలను ఇప్పటికి వెయ్యికి పైగా గ్రామాలకు విస్తరించారు ప్రదీప్ లొఖాండే. మూడు లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. ఇంకా కావాలనే వారికి పుస్తకాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వినూత్నమైన ఆలోచన విశేషమైన విజయాన్ని తెచ్చిందంటారు ప్రదీప్ లొఖాండే. తన పుస్తకాలు అందుకున్న వారిలో దాదాపుగా 50 వేల మంది విద్యార్థులు ఆ పుస్తకాలను చదివి తమ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా పంచుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తారాయన. మహారాష్ట్రలోని 5,800 లైబ్రరీలకు పుస్తక పంపిణీ చేశాక దేశంలో ఉన్న 85 వేల లైబ్రరీలకు తన సేవలను విస్తరించాలని ఉందని, అదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమనీ అంటారు ప్రదీప్ లొఖాండే. పుస్తకాలు కావాలంటే ఒక ఉత్తరం రాయమంటూ కొత్తగా పరిచయమైన వారందరికీ తన అడ్రస్ రాసిస్తారు. సామాజిక, సాహిత్య సేవలకు ఇదో వినూత్నమైన ఆలోచన.