అవయవలోపం ఉన్నా అనితరసాధ్య విజయాలు సాధించడంలో మిన్నగా నిలిచిన దివ్యాంగులకు అభినందన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పంచుకున్న క్రీడానుభవాలు అందరి మనసుల్నీ స్పర్శించాయి. గృహనిర్మాణానికి పేరొందిన జీ స్క్వేర్ హౌసింగ్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్‌లో వింగ్స్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పేరొందిన పారా అథ్లెటిక్స్‌ను నగదు బహుమతులతో పాటు సన్మానించారు.
ఈ సందర్భంగా క్రీడారంగంలో దివ్యాంగుల విజయాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తాయని సీఆర్పీఎఫ్ డిఐజీ అనిల్ మింజ్ అన్నారు. పారా అథ్లెట్స్‌కు సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న రంగాల్లో రాణించేందుకు అన్ని వర్గాల వారూ తమ వంతుగా ప్రోత్సాహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి.సాయి ప్రణీత్ మాట్లాడుతూ క్రీడారంగంలో ఎదురయ్యే సవాళ్లు తనకు తెలుసని వీటిని ఎదుర్కుని విజేతలు కావడం ద్వారా దివ్యాంగులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు.
కార్యక్రమంలో సంస్థ సిఇఒ ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల విజయాలకు తోడ్పడేందుకు వచ్చే ఏడాది నుంచి గెలుపొందిన క్రీడాకారులను సన్మానించడం మాత్రమే కాకుండా క్రీడల్లో పాల్గొనేవారికి ఆర్ధికంగా సాయం అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నివాసి పారా అధ్లెట్ వేణు తొలి దశలో తనని ఎవరూ ప్రోత్సహించేవారు కాదనీ చెబుతూ తానెలా అడ్డంకుల్ని అధిగమించి విజేతగా నిలిచాడో వివరించారు. అదే విధంగా భాగ్యశ్రీ మాథవ్ రావు జావెద్ మాట్లాడుతూ తన అనుభవాలు వివరించారు.
హై జంప్‌లో పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ తో పాటుగా పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న, అర్జున పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్న మరియప్పన్ తంగవేలు, అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గీరీశ్ చంద్ర జోషి, ఇంటర్నేషనల్ పారా అథ్లటిక్స్ ఛాంపియన్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్, కర్ణాటకకు చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కె. గోపీనాథ్, మేథా జయంత్, తమిళనాడుకు చెందిన స్విమ్మింగ్ ఛాంపియన్ ఎస్‌ఆర్ తేజస్విని, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌లు బీర్ భద్ర సింగ్, అజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. భాగ్యశ్రీ మాధవరావు జావేద్ లకు రూ.1లక్ష చొప్పున, మరో ముగ్గురికి రూ.75వేల చొప్పున, మరో ముగ్గురు క్రీడాకారులకు 50వేల చొప్పున నగదు బహముతులను అందించడంతో పాటు ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment