ఆదర్శం వీరి ఆటో బయోగ్రఫీ
పంచామృతం
రాసుకునే ఆసక్తి ఉండాలి కానీ..ప్రతి వ్యక్తికీ ఆత్మకథ రాసేటంతటి జీవితం ఉంటుంది. విజేతలుగా, ప్రముఖస్థాయికి చేరిన వారి జీవిత కథలు అయితే మరింత ఆసక్తికరం.
వీరి జీవిత కథలు స్ఫూర్తిమంత్రాలు. ఔత్సాహికులకు ఆదర్శప్రాయాలు. అలాంటి ఆటోబయోగ్రఫీలను ఏ జీవిత చరమాంకంలోనో రాసుకోవడం కాకుండా, ఒకదశలోనే తమ అనుభవాలను పుస్తకంగా రాసుకుని స్ఫూర్తిని పంచుతున్న వారున్నారు. అలాంటి లివింగ్ లెజెండ్స్‌లో కొందరు...
అబ్దుల్‌కలాం
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’... భారతీయ యువతకు బాగా ఇష్టమైన వ్యక్తి జీవిత కథ ఇది. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం తన ఆత్మకథను ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పేరుతో గ్రంథస్తం చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలోని ఒక సాధారణ కుటుంబం నుంచి తను ఎదిగి వచ్చిన తీరు గురించి అందులో ఆయన వివరించారు. ఈ ఆత్మకథలోని అనేక అధ్యాయాలు అకాడమీ పుస్తకాల్లో పాఠాలుగా కూడా మారాయి.
కపిల్‌దేవ్
తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్‌టీమ్‌కు కెప్టెన్‌గా, జట్టుకు మరపురాని విజయాలను సాధించి పెట్టిన ఆల్‌రౌండర్‌గా ఈ మాజీ క్రికెటర్ భారతీయులకు ఇష్టుడు. ఆయన పదేళ్ల కిందటే ‘స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్’ పేరుతో ఆత్మకథను రచించారు. కెప్టెన్‌గా తన అనుభవాలను పంచుకొన్నారు.
లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్
క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తుడై టూర్‌డీ ఫ్రాన్స్ విజేతగా నిలిచిన తర్వాత సైక్లిస్ట్ లాన్స్‌ఆర్మ్‌స్ట్రాంగ్ ‘ఇట్స్‌నాట్ అబౌట్ ద బైక్’ పేరిట ఆత్మకథ రాశాడు. బాల్యం నుంచి తన జీవితంలోని ఆటుపోట్లను అందులో వివరించాడు. ఇది అనేక మంది క్యాన్సర్ బాధితులకు మానసిక బలాన్ని ఇచ్చే పుస్తకంగా మారింది. తర్వాతికాలంలో లాన్స్ జీవితం వివాదాలపాలైంది.
ఆండ్రూ అగస్సీ
మీకు ఇష్టమైన పుస్తకం ఏమిటి? అంటే, అనేక మంది యువ క్రీడాకారులు ‘ఓపెన్’ అని చెబుతూ ఉంటారు. ఈ పుస్తకం అమెరికన్ టెన్నిస్‌స్టార్ ఆండ్రూ అగస్సీ జీవితసారం. దాదాపు ఐదేళ్ల కిందట అగస్సీ ఈ పుస్తకాన్ని రాశారు. అప్పటి నుంచి ఈ క్రీడాకారుని ఆత్మకథ బెస్ట్‌సెల్లర్ జాబితాలో ఒకటిగా నిలుస్తూ వస్తోంది.
బ్రిట్నీ స్పియర్స్
అమెరికన్‌పాప్ తరంగం బ్రిట్నీస్పియర్స్ ఆటోబయోగ్రఫీ పేరు ‘హార్ట్ టు హార్ట్’. తన జీవితం, ప్రేమ, ఫేమ్, తన స్వప్నాల గురించి బ్రిట్నీ అందులో వివరించింది. పాశ్చాత్య యవతకు మోడల్‌గా మారింది. పిన్న వయసులోనే ఆత్మకథ రచనకు పూనుకొన్న బ్రిట్నీకి ఈ రచన విషయంలో తల్లి నుంచి కూడా సహకారం లభించిందట.