ఆటో భవానీ... బతుకు సవారీ
వారిది ఓ మధ్య తరగతి కుటుంబం. భర్త నంబూరులో చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవననౌక ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మరణించాడు. ముగ్గురు పిల్లల పోషణ భారం మీద పడడంతో కొన్నాళ్లు ఆమె చిన్నాచితకా ఉద్యోగాలు చేసింది. అవేమీ కుటుంబ ఖర్చులకు చాలకపోవడంతో మహిళలకు క్లిష్టమైన వృత్తి అయినా సరే పట్టుదలగా ఆటో నేర్చుకుంది. బతుకు బండి నడపడానికి ఆటో భవానీ అవతారమెత్తింది. - పట్నంబజారు(గుంటూరు)
సారసాగరంలో ఊహించని విధంగా వచ్చిన సునామీ ఆమె బతుకును చెల్లాచెదురు చేసినా...మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. ఆత్మవిశ్వాసంతో ఏటికి ఎదురీదుతోంది. మహిళలకు ఇబ్బందికరమైనా... పిల్లల భవిష్యత్తు కోసం ఆటోడ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకుంది. కష్టాలు, అవమానాలను దిగమింగుతూ ముందుకు సాగుతోంది. నగరంలో ఆటో నడుపుతూ జీవిస్తున్న ‘ఆటో భవాని’ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే...
నంబూరు గ్రామానికి చెందిన కొల్లా హనుమంతరావుకు అదే ప్రాంతానికి చెందిన భవానితో 1995లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఊళ్లోనే చిన్న హోటల్ నడుపుకునేవాడు. వచ్చే ఆదాయంతో ఆ పల్లెటూళ్లో కుటుంబం ఉన్నంతలో ఆనందంగానే గడిపేది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి కాపురంలో ఒక పిడుగులాంటి వార్త అలజడి సృష్టించింది. భర్త తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దాదాపు మూడేళ్లు మంచాన ఉండి 2003లో భర్త మృతి చెందాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు అత్త,మామల ఆదరణతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. అయితే వృద్ధులైన అత్తా, మామలపై భారం వేయడం సరికాదని భావించి 2005లో పిల్లలను తీసుకుని గుంటూరుకు వచ్చింది.
తాను చదివిన పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాల కోసం యత్నించింది. కొన్నాళ్లపాటు చిన్నా, చితకా ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను చదివించుకుంటూ బతుకు బండిని నెట్టుకొచ్చింది. నగరంలో పెరిగిన ఇంటిఅద్దెలు, ఇతర ఖర్చుల కారణంగా వచ్చే జీతం చాలకపోవడంతో ఒక ఆటో డ్రైవర్ వద్ద డ్రైవింగ్ నేర్చుకుంది. ముదితల్ నేర్వగరాని విద్య గలదే...అన్నట్టు కష్టమైనా...బతుకు కష్టాలు గట్టెక్కాలంటే ఇదే సరైన మార్గమని నమ్మి పట్టుదలగా ఆటో నడపడం నేర్చుకుంది. నగరంలో గత రెండేళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోస్తోంది.
ఆడదానికి నువ్వేం నడుపుతావు అన్నారు...
ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాక అద్దె ఆటోల కోసం వెళితే అనేకచోట్ల అవమానాలు ఎదుర్కోవలసి వచ్చిందని భవాని వాపోయింది. ఆడదానికి నువ్వేం నడుపుతావని ఎగతాళి చేశారని చెప్పింది. ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నా... కళ్ల ముందు పిల్లల పోషణభారం కనపడుతుండడంతో అన్నింటిని మౌనంగా భరించింది. ఒక ఆటో యజమాని సహకారంతో రెండేళ్లుగా నగర వీధుల్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.
భవాని నగర వీధుల్లో ఆటో నడుపుతుంటే మహిళ ఆటో నడుపుతోందని కొందరు అబ్బురంగా చూస్తున్నారు. అయితే ఆమె వెనుక ఉన్న విషాదగాధ తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. ముగ్గురు పిల్లలో పెద్దవాడైన అనంత గుప్తా సీఏ సీపీటీ కోర్సు చదువుతున్నాడు. రెండో కుమారుడైన నాగతేజ పదో తరగతితో ఆపేసి, తల్లికి చేదోడువాదోడుగా ఉందామని, ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు కేదార్‌నాథ్ 9వ తరగతి చదువుతున్నాడు.
కష్టాలు అలవాటైపోయాయి
నా భర్త చనిపోయిన నాటి నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను. అత్తమామలు ఎంతో ప్రేమగా కన్నబిడ్డలా చూసినప్పటికి వారికి భారం కాకూడదనే ఇంటి నుంచి బయటకు వచ్చాను. నా బిడ్డలు భవిష్యత్తులో నాలాంటి కష్టాలు పడకూడదు. అందుకే ఎంత కష్టమైనా... ఆటో నడుపుకుంటూ నా పిల్లలను చదివించుకుంటున్నా.. ఈ వృత్తిలో ఆదాయం బాగానే ఉన్నా, సగం అద్దెలకే పోతోంది.
సొంత ఆటో ఉంటే మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఆటో కొనుక్కోవడానికి సహాయం చేస్తారేమోనని చాలామంది అధికారుల చుట్టూ తిరిగాను. ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ద్వారా గానీ, లేదా స్వచ్ఛంద సంస్థల వారు కాని ఆటో కొనిస్తే నడుపుకుంటాను. నా పిల్లల్ని ఇంకా మెరుగ్గా చదివించుకోగలుగుతాను. - భవాని, ఆటోడ్రైవర్