విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
‘‘నేను ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకే స్వతహాగా ధైర్యం ఎక్కువ. ‘ఏ విషయానికీ భయపడకూదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఢీ కొట్టడానికి రెడీగా ఉండాలి’ అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే, మొన్న విరాట్ కోహ్లీ సరిగ్గా మ్యాచ్ ఆడకపోతే నన్ను నిందించినా నేను నిబ్బరంగా ఉండగలిగా. అసలు నాకే మాత్రం సంబంధం లేని, నేను తప్పు చేయని విషయాలకు నేనెందుకు బాధపడాలి? నిన్న మొన్నటివరకూ నేను బయటివాళ్ల మాటలకు ప్రాధాన్యం ఇచ్చేదాన్ని.
నా గురించి ఎవరేమనుకుంటారోనని కంగారుపడేదాన్ని. కానీ, ఇప్పుడు మా అమ్మ, నాన్న, నా సోదరుడుతో పాటు విరాట్ కోహ్లీ మాటలకు మాత్రమే నేను ప్రాధాన్యం ఇస్తాను. మిగతా వాళ్ల మాటలు నాకనవసరం. ఆ నలుగురే నా జీవితం. విరాట్ నా జీవితానికి చాలా ముఖ్యం. మా ఇద్దరి గురించీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మా అభిప్రాయాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అలాగే, మా ఇద్దరికీ ఇంకా చాలా విషయాల్లో పోలికలున్నాయి. ఇద్దరం మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్లమే. ఎవరి అండదండలూ లేకుండా స్వశక్తితో పైకొచ్చినవాళ్లం. మాకేం కావాలో మాకు స్పష్టంగా తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... మా గురించి వచ్చిన విమర్శలు మా అనుబంధాన్ని ఇంకా పటిష్టం చేశాయి.’’
- అనుష్క శర్మ, కథానాయిక