సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కోర్టుల్లో ఏఐ
జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
భర్తీకాని 1,425 పీజీ సీట్లు
2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు
ఆంధ్రప్రదేశ్‌లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల
మంగళగిరి ఎయిమ్స్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్‌ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు
మంత్రి తెలిపారు.
ఉచిత వ్యాక్సిన్‌కు రూ.27,945.14 కోట్లు
కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్‌లో కూడా వ్యాక్సినేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు
కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment