-
అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ కలిసి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం
-
ఒక్కో జిల్లా కేంద్రంలో దాదాపు 13 కోర్టులు
జగిత్యాల జోన్ : కొత్త జిల్లాలుగా మారనున్న జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బందిని నియమించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల్లో కోర్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, రవాణా భారం తగ్గించేందుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీలు కలిసి నూతన కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదిక ఇవ్వగానే, కోర్టుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ప్రస్తుతం ఉన్న కోర్టులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు మొదటి, మూడవ అదనపు కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, ఎస్‌సీ, ఎస్‌టీ కోర్టు, ఎసీబీ కోర్టు, ఐదు మేజిస్ట్రేట్ కోర్టులు, రెండు సబ్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, వినియోగదారుల ఫోరం, లోక్ అదాలత్‌లు ఉన్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, హుస్నాబాద్‌లలో మేజిస్ట్రేట్ కోర్టులు ఉండగా, మంథని, పెద్దపల్లిలలో మేజిస్ట్రేట్ కోర్టులతో పాటు సబ్ కోర్టులు ఉన్నాయి. సిరిసిల్లలో సబ్ కోర్టుతో పాటు రెండు మేజిస్ట్రేట్ కోర్టులు, హుజురాబాద్‌లో సబ్ కోర్టులో పాటు మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, గోదావరిఖనిలో అదనపు జిల్లా కోర్టుతో పాటు మేజిస్ట్రేట్ కోర్టు, జగిత్యాలలో అదనపు జిల్లా కోర్టుతో పాటు సబ్ కోర్టు, మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ కోర్టులు ఉన్నాయి.
జగిత్యాల, పెద్దపల్లిలో పెరగనున్న కోర్టుల సంఖ్య
జగిత్యాలలో ప్రస్తుతం ఉన్న ఆరు కోర్టులకు, పెద్దపల్లిలో ఉన్న రెండు కోర్టులకు అదనంగా వినియోగదారుల ఫోరం, ఫ్యామిలీ కోర్టు, ఎస్‌సీ, ఎస్‌టీ కోర్టు, జిల్లా ప్రధాన న్యాయస్థానం, ఎకై ్సజ్ కోర్టు, పీసీఆర్ కోర్టు, లేబర్ కోర్టు, పర్మినెంట్ లోక్‌అదాలత్‌లు రానున్నాయి. నూతన జిల్లాలోని మండలాల సంఖ్య తక్కువగా ఉండటంతో, కొత్తగా ఏర్పాటు చేసే కోర్టులను అయా జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లిలో సబ్‌కోర్టు, ధర్మపురి, కొండగట్టులో మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేసే అలోచనలు సైతం ఉన్నాయి.
పూర్తి స్థాయి నివేదిక అందగానే..
అయా ప్రాంతాల్లోని బార్ అసోసియేషన్‌ల న్యాయవాదులు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త కోర్టులకు సంబంధించిన విషయాలను రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయశాఖ కార్యదర్శి సేకరిస్తారు. నివేదికను హైకోర్టుతో పాటు ప్రభుత్వానికి అందజేస్తారు. కొత్త జిల్లాల్లో నూతన కోర్టులు ఏర్పాటు చేయడం లేదంటే ఉన్న కోర్టులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. జగిత్యాలలో కొత్త కోర్టులు ఏర్పడే అవకాశం ఉన్నందున జగిత్యాల న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఉన్న జగిత్యాల స్పెషల్ సబ్ జైలును ధరూర్ క్యాంప్‌కు తరలించాలని ప్రభుత్వానికి విన్నవించారు.
కోర్టుల ఏర్పాటుతో సత్వర న్యాయం
– బండ భాస్కర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల
కొత్త కోర్టులను స్వాగతిస్తున్నాం. కొత్త కోర్టుల ఏర్పాటుతో కక్షిదారులకు రవాణాభారం తగ్గడమే కాకుండా సత్వర న్యాయం అందే అవకాశాలున్నాయి. ఒక్కో జిల్లాకు దాదాపు 13 కోర్టులు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన మండలాల్లో సైతం కోర్టులు ఏర్పాటు చేయాలి.
పెండింగ్ భారం తగ్గుతుంది
–కటుకం చంద్రమోహన్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జగిత్యాల
కొన్ని కేసుల్లో కక్షిదారులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. కొత్త కోర్టుల ద్వారా ఏ జిల్లాలో కేసులను ఆ జిల్లాలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కోర్టులతో పాటు జడ్జి పోస్టులను పెంచితే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగనుంది.