భయాందోళనకు గురిచేసేందుకే పేలుళ్లు
అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో దుశ్చర్యకు పాల్పడిన దుండగులు
నెల్లూరు (క్రైమ్): తమ వర్గం వారి పట్ల పోలీసులు, న్యాయస్థానాలు కఠిన వైఖరి అవలంబిస్తున్నాయన్న భావనతో ఓ ఐదుగురు జట్టుగా ఏర్పడి అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తక్కువ పేలుడు సామర్థ్యం కల్గిన ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లను వినియోగించి కోర్టులు, ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు పథకం రచించారు. అందులో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలు.. కేరళ రాష్ట్రంలోని కొల్లాం, మలపురం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు.
దీనిపై శనివారం నిందితుల విచారణ పూర్తయింది. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఇస్మాల్‌పురానికి చెందిన ఎన్.అబ్బాస్ అలీ, చెన్నై పాలవక్కంకు చెందిన దావూద్ సులేమాన్, మదురై జిల్లా విశ్వాంత్‌నగర్‌కు చెందిన ఎం.సంసూన్ కరీం రాజా, కె.పాడూరుకు చెందిన మొహ్మద్ అయూబ్, మదురై త్యారిమార్కెట్‌కు చెందిన షంషుద్దీన్ అలియాస్ కురువ షంషుద్దీన్‌లు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు.