న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి(56) అనే మహిళకు చెందిన పవర్‌బ్యాంకు పేలుడు కలకలం రేపింది. శబ్దం చేస్తూ పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం మాళవిక ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు. తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. అక్కడ హ్యాండ్ బ్యాగులోని వస్తువులను చూపించానికి నిరాకరించడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు సంభవించడంతో కొద్దిసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆమెను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఐపీసీ సెక్షన్ 336, 285 ల కింద మాళవికను అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పయిందంటూ ఆమె క్షమాపణ కోరిందనీ, అయితే విచారణ అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేశామని ఎయిర్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ భాటియా తెలిపారు. ఆమె నేపథ్యం గురించి ఖచ్చితంగా తెలియదు కానీ ఒక టీవీ నటిగా అనుమానిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment