
కర్నూలు: జిల్లాలోని అవుకు మండలం చెన్నంపల్లెలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన మాదిగ వరకుమార్(12) అనే విద్యార్థి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరకుమార్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా, ఆట బంతిగా భావించి నాటు బాంబును చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక్కసారిగా ఆ బాలుడి చేతిలోనే పేలిపోవడంతో వరకుమార్ రెండు చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. ఫ్యాక్షన్ గ్రామంలో నాటుబాంబు పేలడం, ఒక విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ సోమ్లానాయక్, బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి
పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. నాటు బాంబు పేలుడు ఘటనపై భిన్న కోణాల్లో విచారణ చేపట్టామని, అనుమానితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడిస్తామన్నారు. చెన్నంపల్లె గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment