తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! | A man from Rajasthan who lost his life to a lion in Tirupati Zoo | Sakshi
Sakshi News home page

తిరుపతి జూ ఘటన: మద్యం మత్తు? ఆత్మహత్యా?

Published Fri, Feb 16 2024 11:24 AM | Last Updated on Sun, Feb 18 2024 9:31 PM

A man from Rajasthan who lost his life to a lion in Tirupati Zoo - Sakshi

తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్‌ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్‌(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే..

కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం..  గుర్జర్‌ గురువారమే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్‌ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్‌ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు.

అంతటితో ఆగకుండా.. వంద మీ­ట­ర్ల దూ­రంలో ఉన్న సింహా­న్ని చూసి గట్టిగా అరి­­చాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్‌ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్‌ గుర్జర్‌ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. 

ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్‌ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు.  పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్‌ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.  ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement