Tirupati Zoo Park
-
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్‌క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్‌క్లోజర్‌లోకి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!
తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా.. వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్‌లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు. పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. గుర్తు తెలియని వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్లోకి దూకాడు. దీంతో సందర్శకుడిని సింహం నోట కరచుకొని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం. ఎస్వీ జూపార్క్‌లో సింహం దాడి ఘటనపై స్పందించిన జూ అధికారులు.. ఎస్వీ జూ పార్క్ క్యురేటర్ మీడియాతో మట్లాడారు. ‘మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో సింహం ఎంక్లోజర్లోకి ఓ వ్యక్తి దూకి వెళ్ళాడు. జూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసే లోపే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళాడు. సింహం మెడ ప్రాంతంలో నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళడంతో మృతి చెందాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించాం. అతను ఒక్కడే వచ్చాడు. పోలీసులుకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాం. పోస్ట్‌మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలింపు’ అని తెలిపారు. -
చిక్కిన మదపుటేనుగు..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది. ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపోయింది. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరుకుంది. ఒంటరి ఏనుగు 197–రామాపురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏనుగులతో సిద్ధంగా ఉంటూ మదపుటేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది కిందపడిపోయింది. తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో చిత్తూరు అటవీశాఖ అధికారి చైతన్యకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వహించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. -
పెద్దపులికి వాసనను గుర్తించే శక్తి అమోఘం
ఆత్మకూరు రూరల్: కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లుగా నల్లమలలో తల్లి పులి నుంచి తప్పిపోయిన కూనలను తిరిగి తల్లి వద్దకు చేర్చే ప్రక్రియ విఫలంకావడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి చాటున సహజంగా వేట నేర్చుకుని నల్లమల అభయారణ్యంలో పంజా విసరాల్సిన పులి కూనలు జూపార్క్ ఎన్క్లోజర్లలో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం నల్లమలలో పులి కూనల పునరేకీకరణ యత్నం విఫలమయ్యేందుకు అటవీ అధికారుల అభద్రతాభావమేనని స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచి అయిన పులి సంరక్షణ అత్యంత కీలకం. ఈ విషయంలో అటవీ శాఖ ఎంతో బాధ్యతాయుతమైన విధి నిర్వహణగా పరిగణిస్తోంది. ఇందులో విఫలమైన అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తోంది. ఈ భయంతోనే పులి కూనలను తల్లి వద్దకు చేర్చడంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది. పిల్లలను అందుబాటులో ఉంచి తల్లి చెంతకు చేరేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ముందు పులిని వెతికి ఆ తరువాత పిల్లలను దాని వద్దకు చేర్చాలనే ప్రమాద రహిత, నింపాది చర్యలకు ప్రాధాన్యత నిచ్చారు. పులి సంరక్షణలో ఎంతో అనుభవమున్న హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్)సభ్యులు ఈ పద్ధతిపై విమర్శలు చేస్తున్నారు. సుమారు 2 కి.మీ వలయం పరిధిలో తన కూనలతో పెద్దపులి పర్యవేక్షణ చేయ గలదు. అయితే కూనలు కొద్దిగా నీరసించి పోవడంతో వాటికేమైనా అవుతుందేమోన్న భయంతో అధికారులు ప్రమాద రహిత మార్గంలో యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. తొలిరోజున పెద్ద గుమ్మడాపురం సమీపంలో తల్లి పులి టీ108 గాడ్రింపులు వినపడ్డాయి. అలాగే సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయి. సమీపంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో రోడ్డు దాటుతూ పులి కనిపించింది. అక్కడికి పులికూనలను తీసుకు వెళ్లి తల్లి కోసం ప్రయతి్నంచి ఉంటే తల్లి ఒడి చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేది. మీడియా కారణంగా పులి కూనల విషయం వెలుగులోకి రావడం, గుమ్మడాపురం గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే కొందరు మీడియా ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సంచరించడంతో ఆ అలికిడికి తల్లి పులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోడంతో కూనలు తిరుపతి జూకు తరలించాల్సి వచ్చిందని చెప్పవచ్చు. పులి కూనలు పంజా విసిరేదెలా..! పులి కూనలు ఏకారణంగానైనా జూలో పరాన్నజీవిగా మారితే ఇక అవి కనీసం కోడి పిల్లను కూడా వేటాడే శక్తిని కూడా కోల్పోతాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల మేరకు నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించారు. అయితే ఇన్–సీటు ఎన్‌క్లోజర్‌లో ఉంచిన పులికూనలు కౌమార దశకు రాగానే అక్కడ సహజ ఆవరణలోనే వాటికి వేట నేర్పి ఆపై అడవిలో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వేటపై శిక్షణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ అలా ప్రయతి్నంచినా అడవుల్లో అత్యంత వేగంగా పరిగెత్తి గడ్డితినే వన్య ప్రాణులను జూ పోషిత పులులు వేటాడలేక ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపులికి ఘ్రాణ శక్తి అపారం పెద్దపులికి వాసనను గుర్లించే శక్తి అమోఘం. ఒకరకంగా పులి వాసనలను గుర్తించడం ద్వారా తన వేట, తన రక్షణను మొత్తం మీద జీవన విధానాన్నే రూపొందించుకుంటుంది. తన కూనలను వదలి వేటకు వెళ్లినపుడు గరిష్టం రెండు కి.మీ. పరిధి నుంచి కూడా వాటితో సంబంధం కలిగి ఉంటుంది. తనదైన తరంగ ధైర్ఘ్యంలో శబ్దాలు చేస్తూ కూనలను పర్యవేక్షించగలదు. అందుకే సాధారణంగా కూనలు తల్లి పులితో ఎప్పుడూ తప్పి పోవు. – ఇమ్రాన్ సిద్దిఖి, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్) -
పులి పిల్లలకు అడవి పాఠాలు.. జూలో రెండేళ్ల పాటు చేసేది ఇదే..
సాక్షి, అమరావతి: ఆత్మకూరు సమీపంలో తల్లి పులి నుంచి తప్పిపోయిన 4 పులి పిల్లలకు అడవి పాఠాలు నేర్పేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. ఇప్పటికే వాటిని తిరుపతి జూ పార్క్‌లోని ఇన్ సిటు ఎన్‌క్లోజర్(సహజ స్థితిలో ఉండే ఆవరణ)కు చేర్చారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్‌క్లోజర్ ఇప్పటివరకు ఖాళీగా ఉంది. ఇందులో పెరిగే జంతువులను చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉండదు. అడవి మాదిరిగానే దీన్ని ఉంచుతారు. సహజంగా అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఈ ఎన్‌క్లోజర్‌లో పులి పిల్లల్ని కూడా అలాగే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల మేరకు పులి పిల్లలకు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షల్లో పాసైతేనే అడవిలోకి.. దొరికిన నాలుగు ఆడ పులి పిల్లల వయసు 60 రోజులుగా నిర్ధారించారు. రెండేళ్ల వయసు వచ్చే వరకు వాటిని ఈ జూలోనే ఉంచుతారు. కానీ.. వాటిని జూలోని మిగతా జంతువుల్లా కాకుండా అడవిలో ఉన్నట్లు జీవించేలా చూస్తారు. 45–60 రోజుల పులి పిల్లలకు మేక పాలు, చికెన్ సూప్ ఆహారంగా ఇస్తారు. 61వ రోజు నుంచి ఉడికించిన చికెన్ ముక్కలు పెడతారు. 75–90 రోజుల మధ్య ఎముకతో పూర్తిగా ఉడికించిన చికెన్ అందిస్తారు. 90–105 రోజుల మధ్య సగం ఉడికిన చికెన్, 105–120 రోజుల మధ్య పచ్చి చికెన్, 120–150 రోజుల మధ్య గొడ్డు మాంసం సూప్, చికెన్‌తో కలిపి ఇస్తారు. 6 నెలల తర్వాత పూర్తి పచ్చి గొడ్డు, కోడి మాంసాన్ని ఆహారంగా అందిస్తారు. ఒక సంవత్సరం తర్వాత అవి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొన్ని జంతువులను వాటికి తెలియకుండానే ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. నాలుగు పిల్లలు ఎన్ని జంతువులను ఎలా వేటాడాయనే విషయాలను నమోదు చేస్తారు. ఇంకా అడవిలో ఎలా జీవించాలనే దానిపై కొన్ని పరీక్షలు పెడతారు. సంవత్సరం తర్వాత నుంచి మనుషులు వాటికి కనపడకుండానే పరిశీలిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అడవిలో ఒంటరిగానైనా అవి వేటాడి జీవించగలవని నిర్ధారణ అయితే రెండు సంవత్సరాల తర్వాత వాటిని అడవిలో వదులుతారు. ఇందుకోసం వాటికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు. వాటిలో పాస్ అయితేనే అడవిలో వదిలే అవకాశం ఉంటుంది. తల్లి పిల్లల్ని ఎందుకు వదిలేస్తుందంటే.. పులి పిల్లలు వైకల్యంతో పుట్టినా.. బలహీనంగా ఉన్నా.. గాయాలై నడవలేకపోయినా.. తల్లి అనారోగ్యంతో ఉన్నా.. లేక వేట/నీటి కోసం వెళ్లినప్పుడు తప్పిపోయినా తల్లి పులి పిల్లల్ని వదిలేస్తుందని ఎన్టీసీఏ చెబుతోంది. ఆత్మకూరు ఘటనలో పులి తన పిల్లల్ని సురక్షితమని భావించిన చోట ఉంచి వేట కోసమో లేదా నీళ్ల కోసమో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా పులి పిల్లలు అటవీ శాఖకు దొరికితే వెంటనే వాటిని జూ పార్క్‌కు తరలిస్తారు. కానీ.. ఆత్మకూరు సమీపంలో దొరికిన పులి పిల్లల్ని వెంటనే కాపాడగలిగిన అటవీ శాఖ తల్లి పులి గాండ్రింపులు వినపడటం, పిల్లల కోసం వచ్చినట్టు నిర్ధారణ కావడంతో దానికి జత చేసేందుకు ప్రయత్నించింది. తల్లి పులి వద్దకు వెళ్లేందుకు వాటిని వదిలినా ఎండ తీవ్రతతో అవి వదిలిన చోటే వెనక్కి వచ్చేశాయి. తల్లి పులి ఉనికి కోసం పులి ఆవాస ప్రాంతంలో 50 కెమేరా ట్రాప్‌లు అమర్చి గస్తీ నిర్వహించారు. పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖాధికారులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. మనుషుల తాకిడి పిల్లలపై ఉండటంతో తల్లి పులి వాటిని స్వీకరించడం లేదని స్పష్టమవడం, ఒకవేళ తల్లి పులి వద్దకు వాటిని చేర్చినా పిల్లలు మనుగడ సాగిస్తాయా లేదో స్పష్టత లేకపోవడంతో వాటిని తిరుపతిలోని ఇన్–సిటు ఎన్‌క్లోజర్‌కు తరలించారు. గతంలో పులి పిల్లలు దొరికినా అవి బతికిన ఘటనలు లేవు. ఐదేళ్ల క్రితం ఇలాగే నల్లమలలో 3 పులి పిల్లలు దొరికినా తిరుపతి నుంచి వెటర్నరీ డాక్టర్లు వచ్చేసరికి అవి చనిపోయాయి. కానీ ఇప్పుడు వెంటనే ఆత్మకూరు నుంచి డాక్టర్లు వెళ్లడంతో చికిత్స అందించి బతికించగలిగారు. డాక్టర్లు వెళ్లే సమయానికి నాలుగింటిలో రెండింటికీ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. సకాలంలో వెళ్లడంతో వాటిని కాపాడగలిగారు. రెండేళ్లు శిక్షణ ఇస్తాం ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులి పిల్లల్ని ఇన్–సిటు ఆవరణలో రెండేళ్లు శిక్షణ ఇస్తాం. అవి అడవిలో బతకగలవని నిర్ధారణ అయ్యాక వాటిని నల్లమలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పులి పిల్లల్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. – ఆర్.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) -
యువకుడిపై చిరుత దాడి
-
తిరుపతి : యువకుడిపై చిరుత దాడి
సాక్షి, తిరుపతి : సాక్షి, తిరుపతి : తిరుపతిలో గురువారం ఉదయం చిరుత పులి భీభత్సం సృష్టించింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. అర్ధరాత్రి జీవకణ లోని వీధిలోకి వచ్చిన చిరుత మొదట కుక్క మీద పంజా విసిరింది. అదే సమయంలో కుక్క పెద్దగా అరవడంతో నిద్రపోతున్న నాగరాజు లేచి చూసాడు. అదే సమయంలో చిరుత కుక్కను నోటితో పట్టుకొని గోడ దూకే ప్రయత్నం చేసి కింద పడిపోయింది. తిరిగి గోడ దుకుతుండగా కుక్క తప్పించుకుంది. అయితే ఇదే సమయంలో చిరుతను ప్రత్యక్షంగా చూసిన నాగరాజు భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం తెల్లవారుజామున జూపార్కు వద్ద బైక్‌ను వెంబడించి వ్యక్తి మీద పంజా విసిరింది. చిరుత దాడిలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కొద్దిరోజుల కిందట తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుత సంచారం కలకలంరేపింది. ఓ చిరుత రోడ్డుపై వెళుతున్నవారిపై దాడి చేసింది. వారిద్దరూ చాకచక్యంగా దాడి నుంచి తప్పించుకోగా.. స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాదు తిరుమలలో కూడా ఇటీవల చిరుతల సంచరించాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా నిఘా పెంచారు.. తర్వాత చిరుతలు కనిపించలేదు.. మళ్లీ ఇప్పుడు తిరుపతిలో కనిపించడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. -
ప్రేమ జంటలను బెదిరిస్తే డబ్బులే.. డబ్బులు
ప్రేమజంటల్ని బెదిరించి డబ్బులు దోచుకునే ముఠాలు జిల్లాలో ఎక్కువయ్యాయి. ఇందులో నకిలీ పోలీసులతో పాటు నిజం పోలీసుల పాత్ర కూడా ఉంది. ఈ పనిలో రిస్క్ తక్కువ, డబ్బులు ఎక్కువ. జంటల్ని బెదిరిస్తే మినిమం అర తులమో, తులమో బంగారం దొరుకుతుంది. అంతోఇంతో డబ్బు, సెల్ఫోన్లు దొరకొచ్చు. వాళ్ళు ఎదురు తిరగరు, ఎవరికీ ఫిర్యాదుచేయరు. పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలోని తిరుపతి జూ పార్కు, అలిపిరి బైపాస్ రోడ్డు, చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ సమీపంలోని అటవీప్రాంతం, తలకోన, కైగల్ జలపాతం, హర్సిలీహిల్స్, మదనపల్లె సమీపంలోని కొండలు, మొగిలి సమీపంలోని దేవరకొండ, అరగొండ అటవీప్రాంతం, పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్, భూతలబండ, ముసలిమడుగు దర్గా తదితర ప్రాంతాలు ప్రేమజంటలు, కళాశాల యువతీ యువకులకు నిలయాలుగా మారాయి. కొందరు కానిస్టేబుళ్లకు వీరిని బెదిరించడమే పనిగా మారింది. పనిలో పనిగా నకిలీ పోలీసులకు కూడా సులభంగా డబ్బు సంపాదించే మార్గమిది. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు... సుగాలి తండాకు చెందిన లాల్‌సింగ్ అనే కాని స్టేబుల్ రెండు సంవత్సరాలు పాటు ప్రేమజంటలపై దాడులు చేశాడు. ఓ ధఫా ైకైగల్ జలపాతం వద్ద, మరో ధఫా మొగిలి సమీపంలోని దేవరకొండ వద్ద, మొగిలి ఘాట్‌లో పలువురు ప్రేమికులను బెదిరించి నగదు, నగలు లాక్కెళ్లాడు. ఇద్దరు మాత్రం జరిగిన సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల హత్యలో కొత్తకోణం... పలమనేరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో ఈనెల 1న ఓ కానిస్టేబు ల్, మరో హోమ్‌గార్డు హత్యకు గురయ్యారు.ఇద్దరు ప్రేమికులు ఆటోలో అడవిలోకి వెళ్లారని తెలియగానే సాయంత్రం ఇంకాసేపటికి చీకటి పడుతున్న వేళ వీళ్లిద్దరు అడవిలోకి ఎందుకు వెళ్ళారు? ప్రేమికులు అడవిలోకి వెళ్లినంత మాత్రానా శాంతిభద్రతలకు వచ్చిన లోటేమి లేదు. కనీసం ఎస్‌హెచ్‌వోకు కూడా సమాచారం ఇవ్వలేదు. అంటే ప్రేమజంటలను బెది రించే అలవాటు వీళ్లకుందని పోలీసు అధికారు లే అనుమానిస్తున్నారు. గతంలో వీళ్ల చేతుల్లో అవమానానికి గురైన వాళ్లెవరైనా ఈ హత్యలు చేసివుంటారని అనుమానిస్తున్నారు.ఒకవేళ అడవిలో దోపిడిముఠాలో, ఇతరత్రా దుండగులో వుంటే ఆయుధాలు లేకుండా వెళ్లిన పోలీసుల్ని హత్య చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు.వీళ్లను చూడగానే అడవిలో పారిపోడానికి కావాల్సినంత అవకాశముంది. గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలోని కొందరు పోలీసులు ప్రేమజంట లను గుర్తించడం వారి నుంచి డబ్బులు గుంజ డం అలవాటుగా మార్చుకున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇదే స్టేషన్లో బ్లూకోట్స్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై సైతం ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. *ఈ నెలలోనే పెనుమూరు అటవీ ప్రాంతంలో ఓ జంటపై దుండగులు దాడి చేశారు. *బంగారుపాళ్యం సమీపంలో మరో జంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడి బంగారాన్ని లాక్కెళ్లారు. *పలమనేరు శివార్లలో కొందరు నకిలీ పోలీసులు సైతం ప్రేమజంటలను బెదిరిస్తూనే ఉన్నారు. * కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా తెలియనివెన్నో.