ప్రేమ జంటలను బెదిరిస్తే డబ్బులే.. డబ్బులు
ప్రేమజంటల్ని బెదిరించి డబ్బులు దోచుకునే ముఠాలు జిల్లాలో ఎక్కువయ్యాయి. ఇందులో నకిలీ పోలీసులతో పాటు నిజం పోలీసుల పాత్ర కూడా ఉంది. ఈ పనిలో రిస్క్ తక్కువ, డబ్బులు ఎక్కువ. జంటల్ని బెదిరిస్తే మినిమం అర తులమో, తులమో బంగారం దొరుకుతుంది. అంతోఇంతో డబ్బు, సెల్‌ఫోన్లు దొరకొచ్చు. వాళ్ళు ఎదురు తిరగరు, ఎవరికీ ఫిర్యాదుచేయరు.
పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలోని తిరుపతి జూ పార్కు, అలిపిరి బైపాస్ రోడ్డు, చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ సమీపంలోని అటవీప్రాంతం, తలకోన, కైగల్ జలపాతం, హర్సిలీహిల్స్, మదనపల్లె సమీపంలోని కొండలు, మొగిలి సమీపంలోని దేవరకొండ, అరగొండ అటవీప్రాంతం, పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్, భూతలబండ, ముసలిమడుగు దర్గా తదితర ప్రాంతాలు ప్రేమజంటలు, కళాశాల యువతీ యువకులకు నిలయాలుగా మారాయి. కొందరు కానిస్టేబుళ్లకు వీరిని బెదిరించడమే పనిగా మారింది. పనిలో పనిగా నకిలీ పోలీసులకు కూడా సులభంగా డబ్బు సంపాదించే మార్గమిది.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు...
సుగాలి తండాకు చెందిన లాల్‌సింగ్ అనే కాని స్టేబుల్ రెండు సంవత్సరాలు పాటు ప్రేమజంటలపై దాడులు చేశాడు. ఓ ధఫా ైకైగల్ జలపాతం వద్ద, మరో ధఫా మొగిలి సమీపంలోని దేవరకొండ వద్ద, మొగిలి ఘాట్‌లో పలువురు ప్రేమికులను బెదిరించి నగదు, నగలు లాక్కెళ్లాడు. ఇద్దరు మాత్రం జరిగిన సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల హత్యలో కొత్తకోణం...
పలమనేరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో ఈనెల 1న ఓ కానిస్టేబు ల్, మరో హోమ్‌గార్డు హత్యకు గురయ్యారు.ఇద్దరు ప్రేమికులు ఆటోలో అడవిలోకి వెళ్లారని తెలియగానే సాయంత్రం ఇంకాసేపటికి చీకటి పడుతున్న వేళ వీళ్లిద్దరు అడవిలోకి ఎందుకు వెళ్ళారు? ప్రేమికులు అడవిలోకి వెళ్లినంత మాత్రానా శాంతిభద్రతలకు వచ్చిన లోటేమి లేదు. కనీసం ఎస్‌హెచ్‌వోకు కూడా సమాచారం ఇవ్వలేదు. అంటే ప్రేమజంటలను బెది రించే అలవాటు వీళ్లకుందని పోలీసు అధికారు లే అనుమానిస్తున్నారు.
గతంలో వీళ్ల చేతుల్లో అవమానానికి గురైన వాళ్లెవరైనా ఈ హత్యలు చేసివుంటారని అనుమానిస్తున్నారు.ఒకవేళ అడవిలో దోపిడిముఠాలో, ఇతరత్రా దుండగులో వుంటే ఆయుధాలు లేకుండా వెళ్లిన పోలీసుల్ని హత్య చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు.వీళ్లను చూడగానే అడవిలో పారిపోడానికి కావాల్సినంత అవకాశముంది. గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలోని కొందరు పోలీసులు ప్రేమజంట లను గుర్తించడం వారి నుంచి డబ్బులు గుంజ డం అలవాటుగా మార్చుకున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇదే స్టేషన్‌లో బ్లూకోట్స్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై సైతం ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.
*ఈ నెలలోనే పెనుమూరు అటవీ ప్రాంతంలో ఓ జంటపై దుండగులు దాడి చేశారు.
*బంగారుపాళ్యం సమీపంలో మరో జంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడి బంగారాన్ని లాక్కెళ్లారు.
*పలమనేరు శివార్లలో కొందరు నకిలీ పోలీసులు సైతం ప్రేమజంటలను బెదిరిస్తూనే ఉన్నారు.
* కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా తెలియనివెన్నో.