సాక్షి, అమరావతి: ఆత్మకూరు సమీపంలో తల్లి పులి నుంచి తప్పిపోయిన 4 పులి పిల్లలకు అడవి పాఠాలు నేర్పేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. ఇప్పటికే వాటిని తిరుపతి జూ పార్క్‌లోని ఇన్ సిటు ఎన్‌క్లోజర్(సహజ స్థితిలో ఉండే ఆవరణ)కు చేర్చారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్‌క్లోజర్ ఇప్పటివరకు ఖాళీగా ఉంది. ఇందులో పెరిగే జంతువులను చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉండదు. అడవి మాదిరిగానే దీన్ని ఉంచుతారు. సహజంగా అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఈ ఎన్‌క్లోజర్‌లో పులి పిల్లల్ని కూడా అలాగే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల మేరకు పులి పిల్లలకు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
పరీక్షల్లో పాసైతేనే అడవిలోకి..
దొరికిన నాలుగు ఆడ పులి పిల్లల వయసు 60 రోజులుగా నిర్ధారించారు. రెండేళ్ల వయసు వచ్చే వరకు వాటిని ఈ జూలోనే ఉంచుతారు. కానీ.. వాటిని జూలోని మిగతా జంతువుల్లా కాకుండా అడవిలో ఉన్నట్లు జీవించేలా చూస్తారు. 45–60 రోజుల పులి పిల్లలకు మేక పాలు, చికెన్ సూప్ ఆహారంగా ఇస్తారు. 61వ రోజు నుంచి ఉడికించిన చికెన్ ముక్కలు పెడతారు. 75–90 రోజుల మధ్య ఎముకతో పూర్తిగా ఉడికించిన చికెన్ అందిస్తారు. 90–105 రోజుల మధ్య సగం ఉడికిన చికెన్, 105–120 రోజుల మధ్య పచ్చి చికెన్, 120–150 రోజుల మధ్య గొడ్డు మాంసం సూప్, చికెన్‌తో కలిపి ఇస్తారు. 6 నెలల తర్వాత పూర్తి పచ్చి గొడ్డు, కోడి మాంసాన్ని ఆహారంగా అందిస్తారు.
ఒక సంవత్సరం తర్వాత అవి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొన్ని జంతువులను వాటికి తెలియకుండానే ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. నాలుగు పిల్లలు ఎన్ని జంతువులను ఎలా వేటాడాయనే విషయాలను నమోదు చేస్తారు. ఇంకా అడవిలో ఎలా జీవించాలనే దానిపై కొన్ని పరీక్షలు పెడతారు. సంవత్సరం తర్వాత నుంచి మనుషులు వాటికి కనపడకుండానే పరిశీలిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అడవిలో ఒంటరిగానైనా అవి వేటాడి జీవించగలవని నిర్ధారణ అయితే రెండు సంవత్సరాల తర్వాత వాటిని అడవిలో వదులుతారు. ఇందుకోసం వాటికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు. వాటిలో పాస్ అయితేనే అడవిలో వదిలే అవకాశం ఉంటుంది.
తల్లి పిల్లల్ని ఎందుకు వదిలేస్తుందంటే..
పులి పిల్లలు వైకల్యంతో పుట్టినా.. బలహీనంగా ఉన్నా.. గాయాలై నడవలేకపోయినా.. తల్లి అనారోగ్యంతో ఉన్నా.. లేక వేట/నీటి కోసం వెళ్లినప్పుడు తప్పిపోయినా తల్లి పులి పిల్లల్ని వదిలేస్తుందని ఎన్టీసీఏ చెబుతోంది. ఆత్మకూరు ఘటనలో పులి తన పిల్లల్ని సురక్షితమని భావించిన చోట ఉంచి వేట కోసమో లేదా నీళ్ల కోసమో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా పులి పిల్లలు అటవీ శాఖకు దొరికితే వెంటనే వాటిని జూ పార్క్‌కు తరలిస్తారు. కానీ.. ఆత్మకూరు సమీపంలో దొరికిన పులి పిల్లల్ని వెంటనే కాపాడగలిగిన అటవీ శాఖ తల్లి పులి గాండ్రింపులు వినపడటం, పిల్లల కోసం వచ్చినట్టు నిర్ధారణ కావడంతో దానికి జత చేసేందుకు ప్రయత్నించింది.
తల్లి పులి వద్దకు వెళ్లేందుకు వాటిని వదిలినా ఎండ తీవ్రతతో అవి వదిలిన చోటే వెనక్కి వచ్చేశాయి. తల్లి పులి ఉనికి కోసం పులి ఆవాస ప్రాంతంలో 50 కెమేరా ట్రాప్‌లు అమర్చి గస్తీ నిర్వహించారు. పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖాధికారులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. మనుషుల తాకిడి పిల్లలపై ఉండటంతో తల్లి పులి వాటిని స్వీకరించడం లేదని స్పష్టమవడం, ఒకవేళ తల్లి పులి వద్దకు వాటిని చేర్చినా పిల్లలు మనుగడ సాగిస్తాయా లేదో స్పష్టత లేకపోవడంతో వాటిని తిరుపతిలోని ఇన్–సిటు ఎన్‌క్లోజర్‌కు తరలించారు. గతంలో పులి పిల్లలు దొరికినా అవి బతికిన ఘటనలు లేవు. ఐదేళ్ల క్రితం ఇలాగే నల్లమలలో 3 పులి పిల్లలు దొరికినా తిరుపతి నుంచి వెటర్నరీ డాక్టర్లు వచ్చేసరికి అవి చనిపోయాయి. కానీ ఇప్పుడు వెంటనే ఆత్మకూరు నుంచి డాక్టర్లు వెళ్లడంతో చికిత్స అందించి బతికించగలిగారు. డాక్టర్లు వెళ్లే సమయానికి నాలుగింటిలో రెండింటికీ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. సకాలంలో వెళ్లడంతో వాటిని కాపాడగలిగారు.
రెండేళ్లు శిక్షణ ఇస్తాం
ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులి పిల్లల్ని ఇన్–సిటు ఆవరణలో రెండేళ్లు శిక్షణ ఇస్తాం. అవి అడవిలో బతకగలవని నిర్ధారణ అయ్యాక వాటిని నల్లమలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పులి పిల్లల్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి.
– ఆర్.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)
Comments
Please login to add a commentAdd a comment