ఆత్మకూరు రూరల్: కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లుగా నల్లమలలో తల్లి పులి నుంచి తప్పిపోయిన కూనలను తిరిగి తల్లి వద్దకు చేర్చే ప్రక్రియ విఫలంకావడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి చాటున సహజంగా వేట నేర్చుకుని నల్లమల అభయారణ్యంలో పంజా విసరాల్సిన పులి కూనలు జూపార్క్ ఎన్‌క్లోజర్లలో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం నల్లమలలో పులి కూనల పునరేకీకరణ యత్నం విఫలమయ్యేందుకు అటవీ అధికారుల అభద్రతాభావమేనని స్పష్టంగా కనిపిస్తోంది.
పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచి అయిన పులి సంరక్షణ అత్యంత కీలకం. ఈ విషయంలో అటవీ శాఖ ఎంతో బాధ్యతాయుతమైన విధి నిర్వహణగా పరిగణిస్తోంది. ఇందులో విఫలమైన అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తోంది. ఈ భయంతోనే పులి కూనలను తల్లి వద్దకు చేర్చడంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది. పిల్లలను అందుబాటులో ఉంచి తల్లి చెంతకు చేరేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ముందు పులిని వెతికి ఆ తరువాత పిల్లలను దాని వద్దకు చేర్చాలనే ప్రమాద రహిత, నింపాది చర్యలకు ప్రాధాన్యత నిచ్చారు.
పులి సంరక్షణలో ఎంతో అనుభవమున్న హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్)సభ్యులు ఈ పద్ధతిపై విమర్శలు చేస్తున్నారు. సుమారు 2 కి.మీ వలయం పరిధిలో తన కూనలతో పెద్దపులి పర్యవేక్షణ చేయ గలదు. అయితే కూనలు కొద్దిగా నీరసించి పోవడంతో వాటికేమైనా అవుతుందేమోన్న భయంతో అధికారులు ప్రమాద రహిత మార్గంలో యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. తొలిరోజున పెద్ద గుమ్మడాపురం సమీపంలో తల్లి పులి టీ108 గాడ్రింపులు వినపడ్డాయి. అలాగే సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయి.
సమీపంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో రోడ్డు దాటుతూ పులి కనిపించింది. అక్కడికి పులికూనలను తీసుకు వెళ్లి తల్లి కోసం ప్రయతి్నంచి ఉంటే తల్లి ఒడి చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేది. మీడియా కారణంగా పులి కూనల విషయం వెలుగులోకి రావడం, గుమ్మడాపురం గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే కొందరు మీడియా ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సంచరించడంతో ఆ అలికిడికి తల్లి పులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోడంతో కూనలు తిరుపతి జూకు తరలించాల్సి వచ్చిందని చెప్పవచ్చు.
పులి కూనలు పంజా విసిరేదెలా..!
పులి కూనలు ఏకారణంగానైనా జూలో పరాన్నజీవిగా మారితే ఇక అవి కనీసం కోడి పిల్లను కూడా వేటాడే శక్తిని కూడా కోల్పోతాయి. ఎన్‌టీసీఏ మార్గదర్శకాల మేరకు నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించారు. అయితే ఇన్–సీటు ఎన్‌క్లోజర్‌లో ఉంచిన పులికూనలు కౌమార దశకు రాగానే అక్కడ సహజ ఆవరణలోనే వాటికి వేట నేర్పి ఆపై అడవిలో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వేటపై శిక్షణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ అలా ప్రయతి్నంచినా అడవుల్లో అత్యంత వేగంగా పరిగెత్తి గడ్డితినే వన్య ప్రాణులను జూ పోషిత పులులు వేటాడలేక ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్దపులికి ఘ్రాణ శక్తి అపారం
పెద్దపులికి వాసనను గుర్లించే శక్తి అమోఘం. ఒకరకంగా పులి వాసనలను గుర్తించడం ద్వారా తన వేట, తన రక్షణను మొత్తం మీద జీవన విధానాన్నే రూపొందించుకుంటుంది. తన కూనలను వదలి వేటకు వెళ్లినపుడు గరిష్టం రెండు కి.మీ. పరిధి నుంచి కూడా వాటితో సంబంధం కలిగి ఉంటుంది. తనదైన తరంగ ధైర్ఘ్యంలో శబ్దాలు చేస్తూ కూనలను పర్యవేక్షించగలదు. అందుకే సాధారణంగా కూనలు తల్లి పులితో ఎప్పుడూ తప్పి పోవు.
– ఇమ్రాన్ సిద్దిఖి, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్)
Comments
Please login to add a commentAdd a comment