Operation Tiger
-
పెద్దపులికి వాసనను గుర్తించే శక్తి అమోఘం
ఆత్మకూరు రూరల్: కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లుగా నల్లమలలో తల్లి పులి నుంచి తప్పిపోయిన కూనలను తిరిగి తల్లి వద్దకు చేర్చే ప్రక్రియ విఫలంకావడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి చాటున సహజంగా వేట నేర్చుకుని నల్లమల అభయారణ్యంలో పంజా విసరాల్సిన పులి కూనలు జూపార్క్ ఎన్క్లోజర్లలో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం నల్లమలలో పులి కూనల పునరేకీకరణ యత్నం విఫలమయ్యేందుకు అటవీ అధికారుల అభద్రతాభావమేనని స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచి అయిన పులి సంరక్షణ అత్యంత కీలకం. ఈ విషయంలో అటవీ శాఖ ఎంతో బాధ్యతాయుతమైన విధి నిర్వహణగా పరిగణిస్తోంది. ఇందులో విఫలమైన అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తోంది. ఈ భయంతోనే పులి కూనలను తల్లి వద్దకు చేర్చడంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది. పిల్లలను అందుబాటులో ఉంచి తల్లి చెంతకు చేరేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ముందు పులిని వెతికి ఆ తరువాత పిల్లలను దాని వద్దకు చేర్చాలనే ప్రమాద రహిత, నింపాది చర్యలకు ప్రాధాన్యత నిచ్చారు. పులి సంరక్షణలో ఎంతో అనుభవమున్న హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్)సభ్యులు ఈ పద్ధతిపై విమర్శలు చేస్తున్నారు. సుమారు 2 కి.మీ వలయం పరిధిలో తన కూనలతో పెద్దపులి పర్యవేక్షణ చేయ గలదు. అయితే కూనలు కొద్దిగా నీరసించి పోవడంతో వాటికేమైనా అవుతుందేమోన్న భయంతో అధికారులు ప్రమాద రహిత మార్గంలో యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. తొలిరోజున పెద్ద గుమ్మడాపురం సమీపంలో తల్లి పులి టీ108 గాడ్రింపులు వినపడ్డాయి. అలాగే సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయి. సమీపంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో రోడ్డు దాటుతూ పులి కనిపించింది. అక్కడికి పులికూనలను తీసుకు వెళ్లి తల్లి కోసం ప్రయతి్నంచి ఉంటే తల్లి ఒడి చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేది. మీడియా కారణంగా పులి కూనల విషయం వెలుగులోకి రావడం, గుమ్మడాపురం గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే కొందరు మీడియా ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సంచరించడంతో ఆ అలికిడికి తల్లి పులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోడంతో కూనలు తిరుపతి జూకు తరలించాల్సి వచ్చిందని చెప్పవచ్చు. పులి కూనలు పంజా విసిరేదెలా..! పులి కూనలు ఏకారణంగానైనా జూలో పరాన్నజీవిగా మారితే ఇక అవి కనీసం కోడి పిల్లను కూడా వేటాడే శక్తిని కూడా కోల్పోతాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల మేరకు నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించారు. అయితే ఇన్–సీటు ఎన్‌క్లోజర్‌లో ఉంచిన పులికూనలు కౌమార దశకు రాగానే అక్కడ సహజ ఆవరణలోనే వాటికి వేట నేర్పి ఆపై అడవిలో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వేటపై శిక్షణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ అలా ప్రయతి్నంచినా అడవుల్లో అత్యంత వేగంగా పరిగెత్తి గడ్డితినే వన్య ప్రాణులను జూ పోషిత పులులు వేటాడలేక ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపులికి ఘ్రాణ శక్తి అపారం పెద్దపులికి వాసనను గుర్లించే శక్తి అమోఘం. ఒకరకంగా పులి వాసనలను గుర్తించడం ద్వారా తన వేట, తన రక్షణను మొత్తం మీద జీవన విధానాన్నే రూపొందించుకుంటుంది. తన కూనలను వదలి వేటకు వెళ్లినపుడు గరిష్టం రెండు కి.మీ. పరిధి నుంచి కూడా వాటితో సంబంధం కలిగి ఉంటుంది. తనదైన తరంగ ధైర్ఘ్యంలో శబ్దాలు చేస్తూ కూనలను పర్యవేక్షించగలదు. అందుకే సాధారణంగా కూనలు తల్లి పులితో ఎప్పుడూ తప్పి పోవు. – ఇమ్రాన్ సిద్దిఖి, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్) -
పులి పిల్లలకు అడవి పాఠాలు.. జూలో రెండేళ్ల పాటు చేసేది ఇదే..
సాక్షి, అమరావతి: ఆత్మకూరు సమీపంలో తల్లి పులి నుంచి తప్పిపోయిన 4 పులి పిల్లలకు అడవి పాఠాలు నేర్పేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. ఇప్పటికే వాటిని తిరుపతి జూ పార్క్‌లోని ఇన్ సిటు ఎన్‌క్లోజర్(సహజ స్థితిలో ఉండే ఆవరణ)కు చేర్చారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్‌క్లోజర్ ఇప్పటివరకు ఖాళీగా ఉంది. ఇందులో పెరిగే జంతువులను చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉండదు. అడవి మాదిరిగానే దీన్ని ఉంచుతారు. సహజంగా అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఈ ఎన్‌క్లోజర్‌లో పులి పిల్లల్ని కూడా అలాగే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల మేరకు పులి పిల్లలకు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షల్లో పాసైతేనే అడవిలోకి.. దొరికిన నాలుగు ఆడ పులి పిల్లల వయసు 60 రోజులుగా నిర్ధారించారు. రెండేళ్ల వయసు వచ్చే వరకు వాటిని ఈ జూలోనే ఉంచుతారు. కానీ.. వాటిని జూలోని మిగతా జంతువుల్లా కాకుండా అడవిలో ఉన్నట్లు జీవించేలా చూస్తారు. 45–60 రోజుల పులి పిల్లలకు మేక పాలు, చికెన్ సూప్ ఆహారంగా ఇస్తారు. 61వ రోజు నుంచి ఉడికించిన చికెన్ ముక్కలు పెడతారు. 75–90 రోజుల మధ్య ఎముకతో పూర్తిగా ఉడికించిన చికెన్ అందిస్తారు. 90–105 రోజుల మధ్య సగం ఉడికిన చికెన్, 105–120 రోజుల మధ్య పచ్చి చికెన్, 120–150 రోజుల మధ్య గొడ్డు మాంసం సూప్, చికెన్‌తో కలిపి ఇస్తారు. 6 నెలల తర్వాత పూర్తి పచ్చి గొడ్డు, కోడి మాంసాన్ని ఆహారంగా అందిస్తారు. ఒక సంవత్సరం తర్వాత అవి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొన్ని జంతువులను వాటికి తెలియకుండానే ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. నాలుగు పిల్లలు ఎన్ని జంతువులను ఎలా వేటాడాయనే విషయాలను నమోదు చేస్తారు. ఇంకా అడవిలో ఎలా జీవించాలనే దానిపై కొన్ని పరీక్షలు పెడతారు. సంవత్సరం తర్వాత నుంచి మనుషులు వాటికి కనపడకుండానే పరిశీలిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అడవిలో ఒంటరిగానైనా అవి వేటాడి జీవించగలవని నిర్ధారణ అయితే రెండు సంవత్సరాల తర్వాత వాటిని అడవిలో వదులుతారు. ఇందుకోసం వాటికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు. వాటిలో పాస్ అయితేనే అడవిలో వదిలే అవకాశం ఉంటుంది. తల్లి పిల్లల్ని ఎందుకు వదిలేస్తుందంటే.. పులి పిల్లలు వైకల్యంతో పుట్టినా.. బలహీనంగా ఉన్నా.. గాయాలై నడవలేకపోయినా.. తల్లి అనారోగ్యంతో ఉన్నా.. లేక వేట/నీటి కోసం వెళ్లినప్పుడు తప్పిపోయినా తల్లి పులి పిల్లల్ని వదిలేస్తుందని ఎన్టీసీఏ చెబుతోంది. ఆత్మకూరు ఘటనలో పులి తన పిల్లల్ని సురక్షితమని భావించిన చోట ఉంచి వేట కోసమో లేదా నీళ్ల కోసమో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా పులి పిల్లలు అటవీ శాఖకు దొరికితే వెంటనే వాటిని జూ పార్క్‌కు తరలిస్తారు. కానీ.. ఆత్మకూరు సమీపంలో దొరికిన పులి పిల్లల్ని వెంటనే కాపాడగలిగిన అటవీ శాఖ తల్లి పులి గాండ్రింపులు వినపడటం, పిల్లల కోసం వచ్చినట్టు నిర్ధారణ కావడంతో దానికి జత చేసేందుకు ప్రయత్నించింది. తల్లి పులి వద్దకు వెళ్లేందుకు వాటిని వదిలినా ఎండ తీవ్రతతో అవి వదిలిన చోటే వెనక్కి వచ్చేశాయి. తల్లి పులి ఉనికి కోసం పులి ఆవాస ప్రాంతంలో 50 కెమేరా ట్రాప్‌లు అమర్చి గస్తీ నిర్వహించారు. పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖాధికారులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. మనుషుల తాకిడి పిల్లలపై ఉండటంతో తల్లి పులి వాటిని స్వీకరించడం లేదని స్పష్టమవడం, ఒకవేళ తల్లి పులి వద్దకు వాటిని చేర్చినా పిల్లలు మనుగడ సాగిస్తాయా లేదో స్పష్టత లేకపోవడంతో వాటిని తిరుపతిలోని ఇన్–సిటు ఎన్‌క్లోజర్‌కు తరలించారు. గతంలో పులి పిల్లలు దొరికినా అవి బతికిన ఘటనలు లేవు. ఐదేళ్ల క్రితం ఇలాగే నల్లమలలో 3 పులి పిల్లలు దొరికినా తిరుపతి నుంచి వెటర్నరీ డాక్టర్లు వచ్చేసరికి అవి చనిపోయాయి. కానీ ఇప్పుడు వెంటనే ఆత్మకూరు నుంచి డాక్టర్లు వెళ్లడంతో చికిత్స అందించి బతికించగలిగారు. డాక్టర్లు వెళ్లే సమయానికి నాలుగింటిలో రెండింటికీ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. సకాలంలో వెళ్లడంతో వాటిని కాపాడగలిగారు. రెండేళ్లు శిక్షణ ఇస్తాం ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులి పిల్లల్ని ఇన్–సిటు ఆవరణలో రెండేళ్లు శిక్షణ ఇస్తాం. అవి అడవిలో బతకగలవని నిర్ధారణ అయ్యాక వాటిని నల్లమలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పులి పిల్లల్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. – ఆర్.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) -
మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలం..
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్‌కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్‌కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు -
ఆపరేషన్ ‘టైగర్’కు గరుడా ఫోర్స్
బెంగళూరు : గర్భిణిని పొట్టన పెట్టుకున్న పులిని వేటాడే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందు కోసం మొత్తం 275 మందితో కూడిన 12 ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకాలోని బాంబోటి అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న అంజనా అప్పణ్ణ హణబర అనే 23 ఏళ్ల గర్భిణిని ఈనెల 25న పులి చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పులి వేట కొనసాగుతున్న కొలిక్కి రాలేదు. దీంతో శనివారం రోజున ఆపరేషన్ టైగర్ పేరుతో కార్యాచరణ ప్రణాళికను అధికారులు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కూబింగ్‌లో పాల్గొనే యాంటీ నక్సల్స్ ఫోర్స్‌లోని 10 మంది షార్ఫ్ షూటర్లు, కర్ణాటకకు ప్రత్యేకమైన యాంటి టైరిస్ట్ టీం గరుడాలోని ఐదుగురితో పాటు పోలీసు, అటవీశాఖ, స్థానిక గిరిజనులతో కలిపి మొత్తం 275 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా, వాసన ద్వారా పులి సంచరించే ప్రాంతాన్ని కనిపెట్టే సామర్థ్యం ఉన్న సూలిగరు తెగకు చెందిన ఆరుగురు అటవీప్రాంతంలో నివసించే వారూ ఈ ఆపరేషన్ టైగర్‌లో పాల్పంచుకుంటున్నారు. వీరు చామరాజ నగర నుంచి ప్రత్యేకంగా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి రప్పించుకున్నారు. కాగా, సంఘటన స్థాలం పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల్లో ఈ ఆపరేషన్ టైగర్ కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది. కాగా, పులి కనిపించిన వెంటనే ఆపరేషన్ టైగర్ కోసం 24 గంటల పాటూ పనిచేసే 9449863682 సహాయక కేంద్రానికి సమాచారం అందించాలని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్.హెచ్ మొకాసి ‘సాక్షి’కి తెలిపారు.