ఆపరేషన్ ‘టైగర్’కు గరుడా ఫోర్స్
బెంగళూరు : గర్భిణిని పొట్టన పెట్టుకున్న పులిని వేటాడే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందు కోసం మొత్తం 275 మందితో కూడిన 12 ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకాలోని బాంబోటి అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న అంజనా అప్పణ్ణ హణబర అనే 23 ఏళ్ల గర్భిణిని ఈనెల 25న పులి చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పులి వేట కొనసాగుతున్న కొలిక్కి రాలేదు. దీంతో శనివారం రోజున ఆపరేషన్ టైగర్ పేరుతో కార్యాచరణ ప్రణాళికను అధికారులు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కూబింగ్‌లో పాల్గొనే యాంటీ నక్సల్స్ ఫోర్స్‌లోని 10 మంది షార్ఫ్ షూటర్లు, కర్ణాటకకు ప్రత్యేకమైన యాంటి టైరిస్ట్ టీం గరుడాలోని ఐదుగురితో పాటు పోలీసు, అటవీశాఖ, స్థానిక గిరిజనులతో కలిపి మొత్తం 275 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
కాగా, వాసన ద్వారా పులి సంచరించే ప్రాంతాన్ని కనిపెట్టే సామర్థ్యం ఉన్న సూలిగరు తెగకు చెందిన ఆరుగురు అటవీప్రాంతంలో నివసించే వారూ ఈ ఆపరేషన్ టైగర్‌లో పాల్పంచుకుంటున్నారు. వీరు చామరాజ నగర నుంచి ప్రత్యేకంగా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి రప్పించుకున్నారు. కాగా, సంఘటన స్థాలం పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల్లో ఈ ఆపరేషన్ టైగర్ కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది. కాగా, పులి కనిపించిన వెంటనే ఆపరేషన్ టైగర్ కోసం 24 గంటల పాటూ పనిచేసే 9449863682 సహాయక కేంద్రానికి సమాచారం అందించాలని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్.హెచ్ మొకాసి ‘సాక్షి’కి తెలిపారు.