country bomb
-
ఆట బంతి అనుకుని నాటు బాంబును..
కర్నూలు: జిల్లాలోని అవుకు మండలం చెన్నంపల్లెలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన మాదిగ వరకుమార్(12) అనే విద్యార్థి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరకుమార్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా, ఆట బంతిగా భావించి నాటు బాంబును చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక్కసారిగా ఆ బాలుడి చేతిలోనే పేలిపోవడంతో వరకుమార్ రెండు చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. ఫ్యాక్షన్ గ్రామంలో నాటుబాంబు పేలడం, ఒక విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ సోమ్లానాయక్, బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. నాటు బాంబు పేలుడు ఘటనపై భిన్న కోణాల్లో విచారణ చేపట్టామని, అనుమానితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడిస్తామన్నారు. చెన్నంపల్లె గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. -
పాపం కుక్క! నోట్లో నాటు బాంబు పెట్టుకుని..
సాక్షి, సూర్యపేట : ‘ఒక్కడు’ సినిమా చూసిన వారికి.. కుక్క నాటుబాంబు నోట్లో పెట్టుకుని పరిగెత్తే సీను గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో తెలంగాణ శకుంతల పెంపుడు కుక్క బాంబును నోట్లో పెట్టుకుని, ఆమె వైపు పరిగెత్తుతుంది. ఆమె భయంతో దాని నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తూతూ ఓ ఇంట్లోకి వెళుతుంది. ఆ కుక్క కూడా ఆ ఇంట్లోకి దూరిన వెంటనే ఆమె తలుపులు మూయటం, బాంబు పేలటం. ఇది ఆ సీను. కొద్దిగా ఇలాంటి సంఘటనే సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వీధి కుక్క బాంబును నోట్లో పెట్టుకుని పరిగెత్తుకు వెళుతూ ప్రమాదానికి గురై మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఓ వీధి కుక్కకు ఓ నాటు బాంబు దొరికింది. ఏదో తినే వస్తువు అనుకున్న ఆ కుక్క దాని నోట కరుచుకుని పరిగెత్తింది. ఉత్సాహంతో దాన్ని గట్టిగా కొరికింది. అంతే బాంబు కాస్తా పేలి మరణించింది. ఊర్లో నాటు బాంబు కలకలం రేపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
నాటు బాంబు తిని ఏనుగు మృతి
ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం పులుబోనువారిపల్లెలో సోమవారం నాటు బాంబు తిని ఏనుగు మృతి చెందింది. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయాల్లో అటవీ సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తూ పగటిపూట శేషాచలం అడవుల్లో సేదదీరుతున్నాయి. ఆదివారం రాత్రి మండలంలోని నెరబైలు పంచాయతీ పులుబోనువారిపల్లెకు సమీపంలోని ఓ మామిడితోటలోకి ఆరు సంవత్సరాల ఆడ ఏనుగు వచ్చింది. అక్కడున్న ఓ నాటుబాంబును ఆహారం అని భావించి తినడంతో నోటిబాగం పేలి మామిడి తోటలో మృతి చెందింది. సోమవారం గుర్తించిన రైతులు అటవీశాఖాధికారులకు తెలిపారు. అటవీ అధికారులు వచ్చి ఏనుగు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. నాటుబాంబు అక్కడకు ఎలావచ్చిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.