చనిపోయిన రైతు పేరిట కాంగ్రెస్ పిటిషన్!
రాజకీయాల కోసం న్యాయస్థానాలను సైతం వాడుకుంటున్న నీచ సంస్కతి కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల కోసం న్యాయస్థానాలను సైతం వాడుకుంటున్న నీచ సంస్కతి కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలపాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలకు ఏనాడూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల సమస్యలు తమవి కావన్న రీతిలో వారు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టులంటే టీఆర్‌ఎస్‌కు అత్యంత గౌరవం ఉందని, కానీ, కాంగ్రెస్ మాత్రం తన రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. 2014లో చనిపోయిన ఓ రైతు పేరిట మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ఈ విధంగా తప్పుడు పిటిషన్ వేసినందుకు కాంగ్రెస్ నేతలపై కోర్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.