సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను అధికారులు అమలు చేయడం లేదని, దీంతో కోర్టు తీర్పుల తాలుకు విజయ ఫలాలను సంబంధిత వ్యక్తులు ఆస్వాదించలేకపోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ, అధికారుల తీరుతో ఆ ఉత్తర్వుల ఫలాలను ఆస్వాదించకుండానే ఓ కక్షిదారుడు తనువు చాలించిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులిచ్చిన తీర్పులను అధికారులు అమలు చేయకపోతుండటంతో, బాధిత వ్యక్తులు విధి లేని పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి అసాంఘిక శక్తులను ఆశ్రయిస్తున్నారని తెలిపింది. అధికారుల తీరుతో న్యాయవ్యవస్థ పరిహాసానికి గురవుతోందని, వ్యవస్థకు ఇది మంచిది కాదంది.
ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి.. కోర్టుల ఆదేశాలను అసలైన స్ఫూర్తితో అమలు చేయాలని హితవు పలికింది. 1995 నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూ వచ్చిన ఆ కక్షిదారుకి అనుకూలంగా.. న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని 43/1, 44/1, 45/1 సర్వే నంబర్లలో ఉన్న తన 31.25 ఎకరాల భూమిని 234 మంది ఆక్రమించుకోవడంతో సుల్తాన్ మోహినుద్దీన్ అనే వ్యక్తి 1995లో న్యాయ పోరాటం ప్రారంభించారు. 1997లో భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం (ఎల్‌జీసీ) ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ఆక్రమణదారులు 1998లో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పటిషన్‌ను హైకోర్టు 2009లో కొట్టేసింది. దీంతో 1997లో తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేసి, అక్రమణదారులను ఖాళీ చేయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలంటూ సుల్తాన్ మోహినుద్దీన్ ఎల్‌జీసీలో 2009లో పిటిషన్ దాఖలు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎల్‌జీసీ, ఆక్రమణదారులను ఖాళీ చేయించి భూమిని మోహినుద్దీన్‌కి స్వాధీనం చేయాలని ఆర్‌డీవోను ఆదేశించింది. అయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఎంత మేర భూమికి అర్హులో అంతమేర స్వాధీనం చేయాలని పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన మోహినుద్దీన్.. 1995లో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఎల్‌జీసీ తాజా ఉత్తర్వులున్నాయని నివేదించారు. విచారణ జరిపిన హైకోర్టు 2010లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది.
స్పందించని రెవెన్యూ అధికారులు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో భూమిని స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఎల్‌జీసీ ఇచ్చిన ఉత్తర్వులను ఆర్‌డీవో అమలు చేయలేదు. మరోవైపు ఆక్రమణదారుల్లో కొందరు 1997లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఎల్‌జీసీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సమయంలోనే మోహినుద్దీన్ కన్నుమూశారు. దీంతో ఆయన వారసులు న్యాయ పోరాటం కొనసాగించారు. ఎల్‌జీసీ ఆదేశాలను రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
తర్వాత కొందరు ఆక్రమణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాలను తిరిగి హైకోర్టుకు పంపింది. తాజాగా అందరి వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం మేరకు ఎంత వరకు మోహినుద్దీన్ అర్హుడో అంత మేర భూమినే స్వాధీనం చేయాలంటూ ఎల్‌జీసీ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఎల్‌జీసీ కోర్టు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని రెవెన్యూ అధికారుల తీరును, పదే పదే నిరర్థక వ్యాజ్యాలు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆక్రమణదారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది.
23 ఏళ్లు పోరాడి గెలిచినా..
Published Sun, Apr 22 2018 3:16 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment