సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో న్యాయస్థానాల లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు ఏప్రిల్ 14వ తేదీ లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు లాక్‌డౌన్‌లో ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు సహా జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ.. వీటన్నింటినీ మూసేయాలని ఆదేశించారు. హైకోర్టులో అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా వారం లో 3 రోజులపాటు విచారిస్తుందన్నారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అత్యవసర కేసుల విచారణకు కారణాలు తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ–మెయిల్ పంపాలన్నారు. ఈ–మెయిల్ ద్వారా వచ్చే వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పరిశీలించి అనుమతిస్తే.. వాటిని సంబంధిత న్యాయమూర్తులు తమ ఇంటి వద్ద ఏర్పాటయ్యే ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుంది. విచారణకు ఎంపికయ్యే కేసుల్ని కక్షిదారులు, న్యాయవాదులకు ఫోన్ మెసేజ్ పంపుతామని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన మరో ప్రకటనలో పేర్కొన్నారు.
రొటేషన్ పద్ధతిలో బాధ్యతలు
కింది కోర్టుల్లో రిమాండ్, బెయిల్, ఇంజక్షన్ ఉత్తర్వులకు సంబంధించిన కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి అత్యవసర కేసుల్ని విచారణ చేసేందుకు జిల్లా జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, మేజిస్ట్రేట్‌లు రొటేషన్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించేం దుకు జిల్లా జడ్జి బాధ్యతలను ఎంపిక చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అత్యవసర కేసులని భావించిన వాటిని కింది కోర్టులు జిల్లా జడ్జికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని, వాటిని జిల్లా జడ్జీలు పరిశీలించి అత్యవసరమని భావించిన కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారణ చేయాలని ఆదేశించింది. ఈ–మెయిల్ ఐడీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని పేర్కొంది.
కింది కోర్టు జడ్జీ లందరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని, అత్యవసర మరణ వాంగ్మూలాల నమోదు, ఎఫ్‌ఐఆర్‌లు తీసుకోవడానికి వారంతా సంబం ధిత హెడ్‌కార్టర్స్‌లోనే ఉండాలని, ఇలాంటి విధులను నిర్వహించేందుకు ఒక్క కోర్టు మాత్రమే పనిచేయాలని, రోజు వారీ నివేదికలను కింది కోర్టుల నుంచి జిల్లా జడ్జి తెప్పించుకుని హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. న్యాయవాదులుగానీ, కక్షిదారులుగానీ ఎవరూ వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని, సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లలోనే అందుబాటులో ఉండాలని, ఫోన్ చేస్తే తక్షణమే విధులకు హాజరయ్యేలా ఉండాలని చెప్పింది. అత్యవసరమైన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండాలని పేర్కొంది. గడువుకు సంబంధించిన ఉత్తర్వుల పొడిగింపు చేస్తున్నట్లు, ఈ నెల 15 నుంచి తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకూ గడువు ఉత్తర్వులు పొడిగింపులో ఉంటాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment