సాక్షి, అమరావతి : టెండర్ నిబంధనలను బిడ్డర్లు సంతృప్తిపరిచారా లేదా అన్న విషయాలు పూర్తిగా బిడ్ ఆహ్వానించిన అధికారుల పరిధిలోనివని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని చెప్పింది. టెండర్ ప్రక్రియలో కోర్టుల జోక్యం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వం, ప్రజలు రెండు విధాలుగా నష్టపోతారని తెలిపింది.
ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, పనుల్లో అసాధారణ జాప్యం వల్ల ప్రజలు మౌలిక సదుపాయాలకు దూరమవుతారని వెల్లడించింది. రూ. 148 కోట్లతో చేపట్టిన రాజుపాళెం – అమరావతి రోడ్డు టెండర్ ప్రక్రియలో ఎలాంటి దోషం లేదని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది.
ఈ పనులను వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కేబీసీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్–కేబీసీ) జాయింట్ వెంచర్‌కు అప్పగించడాన్ని సమర్థించింది. ఈ టెంటర్లపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు.
టెండర్ల తిరస్కరణపై పిటిషన్లు
గుంటూరు జిల్లా రాజుపాళెం – అమరావతి రోడ్డు విస్తరణ, బలోపేతానికి ఆర్ అండ్ బీ టెండర్లు ఆహా్వనించగా, నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు, కొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ టెండర్‌ను, సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో శ్రీసాయినాథ్ కన్‌స్ట్రక్షన్స్ టెండర్‌ను అధికారులు తిరస్కరించారు.
దీనిపై ఇరు కంపెనీలు వేర్వురుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటు వల్ల అనుభవ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయలేదన్నారు. దీనిపై వివరణ ఇచ్చినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ఆర్ అండ్ బీ తరఫున ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపిస్తూ.. అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత బిడ్డర్లదేనన్నారు. బిడ్డర్లను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆన్‌లైన్ ద్వారానే అన్ని పత్రాలు ఇవ్వాలని, ఆఫ్‌లైన్‌లో స్వీకరించే అధికారం అధికారులకు లేదని తెలిపారు. బిడ్ తెరిచిన ఐదు రోజుల తరువాత అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్లు ఇచ్చారన్నారు.
నిబంధనల ప్రకారమే తమ బిడ్‌ను ఆమోదించారని వీఎస్–కేబీసీ జేవీ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుజాత ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలతో ఏకీభవించారు. అప్‌లోడ్ చేయని డాక్యుమెంట్ విషయంలో బిడ్డర్‌ను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్లు చేసిన జాప్యానికి మొత్తం టెండర్ ప్రక్రియను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment