15 నుంచి కోర్టులు ఓపెన్‌ | Courts To Reopen In Phased Manner In Telangana | Sakshi
Sakshi News home page

15 నుంచి కోర్టులు ఓపెన్‌

Published Wed, Jun 10 2020 2:39 AM | Last Updated on Wed, Jun 10 2020 2:40 AM

Courts To Reopen In Phased Manner In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున నగరంలోని హైకోర్టు, ఇతర కోర్టులు మినహా రాష్ట్రంలోని ఇతర కోర్టులన్నీ ఈ నెల 15 నుంచి పనిచేయనున్నాయి. హైకోర్టు, నాంపల్లి క్రిమినల్‌ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, స్మాల్‌ కాజెస్‌ కోర్టులకు ఈ నెల 28 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాల్లోని అన్ని కోర్టులు ఈ నెల 15 నుంచి పనిచేసే విధానంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ నెల 15 నుంచి 30 వరకు తొలి విడత, జూలై 1 నుంచి 15 వరకూ రెండో విడత, జూలై 16 నుంచి ఆగస్టు 7 వరకు మూడో విడత, ఆగస్టు 8 నుంచి నాలుగో విడతగా మార్గదర్శకాలను జారీ చేసింది. కోర్టులకు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిసుండటంతో 15 రోజులకోసారి జిల్లా కోర్టు జడ్జీలను, ఎస్పీ, జిల్లా వైద్యాధికారులు, బార్‌ అసోసియేషన్లు సమీక్షించి నివేదిక పంపాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. 

తొలివిడతలో ఒక్కో కోర్టు రోజుకు 20 కేసులే.. 
తొలి రెండు వారాలు కోర్టు సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో 50 శాతం విధులకు హాజరవుతారు. సిబ్బంది హాజరు విషయంలో ఏవిధమైన ఒత్తిళ్లు ఉండవు. కోర్టు విధులకు హాజరయ్యే జడ్జీల నుంచి సిబ్బంది, న్యాయవాదులు ఇతరులంతా విధిగా మాస్క్‌లు ధరించాలి. మాస్క్‌ లేకపోతే కోర్టుల్లోకి ప్రవేశముండదు. ప్రధాన ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే లోపలికి అనుమతిస్తారు. శానిటైజర్లు వినియోగించాకే కోర్టు హాల్లోకి వెళ్లాలి. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని ప్రభుత్వాసుపత్రికి పంపేస్తారు. అలాగే 65 ఏళ్ల పైబడిన వారికి అనుమతి ఉండదు. ఆ వయసు న్యాయవాదులైతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించవచ్చు. చిన్నపాటి కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఉంటుంది. కోర్టుకు వాదప్రతివాదుల్లో ఎవరైనా హాజరు కాలేకపోతే కోర్టులు ఉత్తర్వులు జారీ చేయవు. రెండువైపులా వాదనల తర్వాతే కోర్టులు ఉత్తర్వులు వెలువరిస్తాయి.

కేసు విచారణకు హాజరు కాకపోతే వారెంట్లు జారీ కావు. భౌతిక దూరం పాటించాలి. రెండు విడతల్లో క్యాంటీన్లు పనిచేయవు. తొలివిడతలో ఒక కోర్టు రోజుకు 20 కేసులనే విచారణ చేస్తాయి. కోర్టులోకి అయిదుగురికే అనుమతి ఉంటుంది. కేసుల విచారణ జాబితా ఒకరోజు ముందే రెడీ చేసి జీపీ, పీపీలు, న్యాయవాదులకు తెలియజేస్తారు. సివిల్‌ కేసుల్లో ఇంజంక్షన్‌ ఆర్డర్స్, అడ్వొకేట్‌ కమిషన్‌ నియామకం, ఆస్తుల అటాచ్‌మెంట్, కుటుంబ వివాదాలు విచారణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వాటిలో తుది విచారణ మొదలవుతుంది. జైళ్లల్లో ఉండే నిందితుల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేస్తారు. రద్దీ తగ్గింపునకు ఈఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు ప్రాధాన్యత ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో సాక్ష్యాల రికార్డు, వాదనలు జరిపే ప్రయత్నాలు ఉంటాయి. రెండో విడతలోనూ ఆ  ఆంక్షలను కొనసాగిస్తూనే సడలింపులిచ్చింది. రోజుకు 40 కేసులను ఒక్కో కోర్టు విచారిస్తుంది. కోర్టులోకి పది మంది వరకు అనుమతి ఉంటుంది. మూడో విడతలో రోజుకు 60 కేసులు చొప్పున ఒక్కో కోర్టు విచారిస్తుంది. మూడో విడతలో మాత్రమే కోర్టుల్లోని క్యాంటీన్లను తెరిచేందుకు అనుమతి ఉంటుంది. బార్‌ అసోసియేషన్లు కూడా ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడో విడతలో తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఇక అప్పటి పరిస్థితులను బట్టి నాలుగో విడతలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు వీలుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement