పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి | Sakshi Guest Column On Reservations In Indian Courts | Sakshi
Sakshi News home page

పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి

Published Fri, Aug 5 2022 12:59 AM | Last Updated on Fri, Aug 5 2022 12:51 PM

Sakshi Guest Column On Reservations In Indian Courts

ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేదు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకాశాలను వెనుకబడిన వర్గాలకు చెందినవారు పొందడం లేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తుల్లో వీరి ప్రాతినిధ్యం సుమారు ఇరవై శాతమే. అదే సమయంలో జనాభాలో ఇరవై శాతం ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా సుమారు ఎనభై శాతం ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషనూ లేదు. ఈ నేపథ్యంలో జడ్జీల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చు. 

భారత ప్రభుత్వం తరపున జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌ చైర్‌పర్సన్‌ (2013–2016)గా, అదే సమయంలోనే అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య చైర్‌పర్సన్‌గా వ్యవహరించాను. నా మూడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన నేతల నుంచి వందలాది ఉత్తరాలను అందుకున్నాను. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేని దుఃస్థితిని వారు నా దృష్టికి తెచ్చారు. సుప్రీం కోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టేలా చూడాలని ఈ వర్గాల ప్రతినిధులు కోరారు.

ఆధిపత్య కులాలతో పోలిస్తే సాపేక్షికంగా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్న కారణంగానే కోర్టుల్లో వెనుకబడిన వర్గాల ప్రాతి నిధ్యం లేదనేదాన్లో నిజం లేదని వీరి భావన. అణచివేయబడిన కమ్యూనిటీలకు చెందిన యువ న్యాయవాదులకు హై–ప్రొఫైల్‌ చాంబర్‌ లేదా సంస్థలో అరుదుగా చోటు లభిస్తోందని వీరు భావిస్తు న్నారు. విజయవంతమైన లాయర్ల కార్యాలయాల్లో వారి సామాజిక వర్గాలకు చెందిన సభ్యుల ఆధిపత్యమే నడుస్తోందని వీరు గమనిం చారు. సీనియర్లు కూడా వారికి విజయవంతమైన లాయర్లు కావడంలో తోడ్పాటు అందిస్తున్నారని వీరి అభిప్రాయం. ఇలా ఎదిగి వచ్చిన లాయర్లలో చాలామంది తర్వాత జడ్జీలుగా మారుతుంటారు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకా శాలను వెనుకబడిన వర్గాల అడ్వకేట్లు పొందడం లేదన్నది వాస్తవం.

న్యాయస్థానంలో ఉన్న జడ్జీల సామాజిక నేపథ్యానికి చెందిన వాడు తమ కేసు వాదిస్తున్న లాయర్‌ అయితే కేసు త్వరగా విచారణకు వచ్చే అవకాశం ఉందని లిటిగెంట్‌ పబ్లిక్‌లో ఒక అభిప్రాయం ఉందని నాకు ఉత్తరాలు పంపిన వెనుకబడిన వర్గాల ప్రతినిధులు భావించారు. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో అమలవుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియ... వివక్షకు ముగింపు పలకటం లేదనీ, న్యాయ మూర్తుల నియామకాల్లో కొన్ని సామాజిక బృందాల ఆధిపత్యాన్ని బద్దలు చేయడం లేదనీ వెనుకబడిన వర్గాల ప్రతినిధుల భావన. జ్యుడీషియల్‌ నియామకాల్లో రిజర్వేషన్లు ప్రస్తుతం ఎగువ, దిగువ స్థాయి జిల్లా న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుండటం గమనించాలి.

ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. బార్, జిల్లా జడ్జీలకు చెందిన అడ్వకేట్లను ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమిస్తున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అడ్వ కేట్లను కూడా రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమి స్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియా మకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చనే అభిప్రాయం ఉంటోది.

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రాతినిధ్య పరమైన వాస్తవికతను అంచనా వేయడానికి, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల సామాజిక నేపథ్యానికి చెందిన డేటాను సేకరించడమైనది. అలాగే విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన డేటా కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ డేటాను సమర్పించడంలో జడ్జీల సామాజిక నేపథ్యానికీ... వారి ప్రతిభ, పనితీరు లేదా న్యాయ దృక్పథాలు, నిర్ణయాలకు మధ్య సహసంబంధం ఉందని చెప్పే ఉద్దేశం లేదని గమనించాలి. సరైన ప్రాతినిధ్యాలకు హామీ ఇవ్వడానికి రాజ్యాంగబద్ధ న్యాయ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని సమర్థించడమే ఈ డేటా సేకరణ మౌలిక ఉద్దేశం. 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుగా పేరు మార్చిన హైదరాబాద్‌ కోర్టును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం, 1956 నవంబర్‌ 5న నెలకొల్పారు. 1948 సెప్టెంబర్‌ 17న భారత యూనియన్‌లో హైదరా బాద్‌ చేరిక తర్వాత, భాషా ప్రాతిపదికన తెలుగుప్రజల కోసం ఏర్పర్చిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్‌. 1956 నుంచి 2014 దాకా హైదరా బాద్‌ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు సేవలం దించింది. 1956లో హైకోర్టు జడ్జీల సంఖ్య 12 కాగా, 2014 నాటికి అది 61కి పెరిగింది. 2014లో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కూ ఉమ్మడి హైకోర్టుగా ఇది నాలుగేళ్లపాటు పనిచేసింది. 2018 డిసెంబర్‌ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ కేంద్రంగానూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి కేంద్రంగానూ హైకోర్టులను పునర్‌ వ్యవస్థీకరించారు. 2019 జనవరి 1న తెలంగాణకు 24 మంది జడ్జీలను, ఆంధ్రప్రదేశ్‌కి 37 మంది జడ్జీలను కేటాయించారు. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయ మూర్తుల సంఖ్య 16. వీరిలో ఏడుగురు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు. ముగ్గురు కమ్మ కమ్యూనిటీకీ, ఇద్దరు బ్రాహ్మణ కమ్యూనిటీకి, ఇద్దరు క్షత్రియ కమ్యూనిటీకి చెందివారు (వీరిలో ఒకరు వెలమ, మరొకరు రాజు). ఒకరు ముస్లిం కమ్యూనిటీకి, ఇంకొకరు షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన జడ్జీల్లో ఒక్కరు మాత్రమే ఎస్సీ! ఎస్టీలు, ఓబీసీలకు అసలు అవకాశమే లభించలేదు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకు 45 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.

ఇందులో 16 మంది బ్రాహ్మణ, 5 మంది రెడ్డి, 5 మంది వైశ్య కులానికి చెందినవారు. ముగ్గురు కాయస్థులు, ముగ్గురు క్షత్రియులు (వెలమ, రాజు, రాజ్‌ పుత్‌), ఇద్దరు కమ్మవారు, ఇద్దరు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. మరో ఇద్దరు పంజాబీలు, ఒకరు మాహేశ్వరి, ఒకరు నాయర్, ఒకరు మరాఠా, మరొరు క్రిస్టియన్‌. వీరిలో ముగ్గురు ప్రధాన న్యాయ మూర్తులు మాత్రమే ఓబీసీలకు చెందినవారు. ఈ ముగ్గురిలో ఒకరు కేరళకు, మరొకరు తమిళనాడుకు చెందిన వారు కాగా ఒకరు తెలం గాణ వాసులు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవారు ఒక్కరూ లేరు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నెలకొల్పినప్పటి నుంచీ నేటి వరకు 253 మంది జడ్జీలు సేవలందించారు. ఇందులో ఓబీసీల నుంచి 43 మంది, ఎస్సీల నుంచి 10 మంది, ఇద్దరు ఎస్టీలు హైకోర్టు జడ్జీలుగా పనిచేశారు. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 80 శాతం పైగా జనాభా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినవారే. రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో వీరి ప్రాతినిధ్య 21.73 శాతం మాత్రమే. అదే సమయంలో జనాభాలో 20 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా 78.26 శాతం ప్రాతినిధ్యం లభించింది.

ఈ డేటా ప్రకారం తెలంగాణ హైకోర్టులో ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ముస్లిం కమ్యూనిటికీ చెందిన జడ్జి ఒక్కరు కూడా లేరు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు, క్రిస్టియన్లకు చెందిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరికి హైకోర్టులోనూ, సుప్రీకోర్టులోనూ న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. (క్లిక్‌: ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి)

కాబట్టి, జనాభాలోని 80 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల కమ్యూనిటీలకు, ఇతర మతపరమైన మైనారిటీ కమ్యూనిటీలకు రాజ్యాంగబద్ధ న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, వారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాలనీ వీరు గౌరవ న్యాయ స్థానాలను, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ డేటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల ఆందోళనను నిర్ధారిస్తోంది. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి జాతీయ న్యాయ కమిషన్‌ ద్వారా తాజాగా శాసనం రూపొందించాలని వీరు కోరుతున్నారు.


- జస్టిస్‌ వి. ఈశ్వరయ్య 
అధ్యక్షుడు, అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement