
కోర్టు తీర్పులతో మహిళా భద్రత ప్రశ్నార్థకం
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం
రాంగోపాల్‌పేట్: న్యాయస్థానాలు ఇస్తున్న కొన్ని తీర్పులు మహిళా భద్రతపై ప్రభావ చూపిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 7ఏళ్లకు లోబడి శిక్ష పడే కేసుల్లో నిందితులకు పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ ఇవ్వవచ్చని ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పుతో 498(ఏ) కేసుల్లో నిందితులకు కూడా స్టేషన్ బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తీర్పుల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్ధకమవుతుందన్నారు.
యామిని, శ్రీలేఖ హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేసి అతనికి శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళ భద్రత, నిర్భయ చట్టాలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటన జరుగడం ఆలోచించాల్సిన విషయన్నారు. ప్రేమ పేరుతో వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే మహిళా కమిషన్‌కు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.