
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు, జిల్లా కోర్టులు ఈ నెల 30 వరకూ అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 14వరకూ లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర కేసుల్ని14వ తేదీ వరకు మాత్రమే విచారించాలని గతంలో హైకోర్టు నిర్ణయించింది. తాజాగా మంగళవారం న్యాయమూర్తులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ప్రస్తుత విధానాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫెరెన్స్ మాత్రమే విచారణ చేస్తున్న విధానం ఇక నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేయాలని కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు, జిల్లా కోర్టులు, రాష్ట్రంలోని ఇతర అన్ని కోర్టులు మే1వ తేదీనుంచి జూన్ 5వ తేదీ వరకు పనిచేస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment