సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో రాష్ట్రంలోని 30 వైన్ (ఏ4) షాపుల లైసెన్సుల రద్దు అంశం చర్చనీయాంశం అవుతోంది. లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవొద్దన్న ప్రభుత్వ నిబంధనలను పాటించని కారణంగా ఈ షాపులపై కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతుంటే, తమపై కక్ష సాధింపు ధోరణితోనే అధికారులు తమ లైసెన్సులు రద్దు చేశారని లైసెన్సీలు వాపోతున్నారు. కరోనా ప్రత్యేక సెస్‌పై వడ్డీ చెల్లింపును సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళ్లిన కారణంగానే ఎలాంటి తప్పు చేయకుండానే తమ లైసెన్సులు రద్దు చేయించారని, దీనిపైనా న్యాయ పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు.
అసలేం జరిగింది?
ఈ ఏడాది మార్చి 22 నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులను ప్రభుత్వం మూయించి వేసింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి మే 6 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు మూసేశారు. మే 6న మళ్లీ నిబంధనలు సడలించి మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే సమయంలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. కరోనా ప్రత్యేక సెస్ పేరుతో 16 శాతం మేర ధరలను సవరించింది. ఈ మేరకు పెంచిన ధరలకు మద్యం అమ్మాలని లైసెన్సీలను నిర్దేశించింది. అయితే, మే 6కు ముందు రోజు ఎక్సైజ్ యంత్రాంగం రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులను జల్లెడ పట్టింది. షాపులను మూసివేసే ముందు రోజు వరకు షాపుల్లో ఉన్న సరుకు వివరాలను స్టాక్ రిజిస్టర్ ద్వారా తెలుసుకుంది. మే 6న షాపులు తెరిచిన తర్వాత గతంలో ఉన్న స్టాకును కూడా పెరిగిన ధరలకు అమ్ముతున్నందున పెరిగిన ధరల మేరకు ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు కరోనా సెస్ చెల్లించాలని అంతర్గతంగా ఉత్తర్వులిచ్చింది.
దీంతో కొందరు వైన్స్ యజమానులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సెస్ చెల్లించగా, మరికొందరు చెల్లించలేదు. దీంతో ఈ ఫీజును వసూలు చేయాలనే ఆలోచనతో ప్రత్యేక సెస్ సకాలంలో చెల్లించని పక్షంలో వడ్డీతో పాటు వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని 21 మంది వైన్స్ యజమానులు హైకోర్టులో సవాల్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో షాపులు తెరవక, వ్యాపారం నడపక తాము ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక సెస్ చెల్లించాలని, అందుకు వడ్డీ చెల్లించాలని కోరడం భావ్యం కాదని, ఆ ఉత్తర్వులను నిలిపేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు 4 వారాల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయడానికి వీల్లేదని, తమ తుది తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు తమపై కక్ష తీర్చుకునేందుకు లైసెన్సులు రద్దు చేశారని కోర్టుకెళ్లిన 21 మంది లైసెన్సీలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం వారి వాదనను కొట్టిపారేస్తున్నారు. కోర్టుకు వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, కోర్టు వారి పిటిషన్‌పై స్టే ఇవ్వలేదని, న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే కోర్టుకు ఏం చెప్పాలో, ఎందుకు సెస్ వసూలు చేయాల్సి వచ్చిందో చెబుతామని అంటున్నారు. ఆ 21 మందిపైనే చర్యలు తీసుకోలేదని, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మరో 9 మందిని కూడా గుర్తించి, ఎక్సైజ్ రూల్స్ ప్రకారం చట్టానికి అనుగుణంగా నడుచుకున్నామని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment