న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో మళ్లీ సరి–బేసి ట్రాఫిక్ విధానం తేవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తామెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సరి–బేసి విధానంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్యాక్సీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తామెన్నడూ తెలపలేదని పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సరి–బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడంలో అంతగా పనిచేయదని అమికస్ క్యూరీకి చెప్పామని గుర్తు చేసింది. ‘‘మీరేం చేయాలో చెప్పడానికి మేమిక్కడ లేం. ఆ విధానం కొనసాగించొద్దు అని మేం చెప్తే, సుప్రీంకోర్టు ఆదేశించినందువల్లే కాలుష్యం ఎక్కువైందని మీరంటారు’’ అని పేర్కొంది. ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగు పడినందున సరి–బేసి విధానం అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment