instant justice
-
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్‌లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్‌గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
కర్నూలు(లీగల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని కేసులను పరిష్కరించారు. హాజరైన కక్షిదారులు సామరస్యంగా తమ కేసులను పరిష్కరించుకుని ప్రశాంత జీవనం గడపాలని ఆమె కోరారు. కేసుల పరిష్కారంతో సత్వర న్యాయం అందడంతో పాటు వ్యయ ప్రయాసాలు తప్పుతాయన్నారు. లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా రాజీ పడి ప్రశాంత జీవనానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.శివకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, కె.స్వప్నరాణి, ఎం.బాబు, ఎం.బాలకోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా, జిల్లా ఎస్పీ రవికృష్ణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 2,617 కేసులు పరిష్కారం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,617 కేసులు పరిష్కారమయ్యాయి. కర్నూలులో 1,277 కేసులు, నంద్యాలలో 533, ఆదోనిలో 108, ఆత్మకూరులో 85, నందికొట్కూరులో 50, ఆళ్లగడ్డలో 112, కోవెలకుంట్లలో 40, బనగానపల్లెలో 67 కేసులు, ఆలూరులో 168, పత్తికొండలో 52, ఎమ్మిగనూరులో 39 కేసులు, డోన్‌లో 86 కేసులు పరిష్కారం చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. 77 రోడ్డు ప్రమాద కేసులో బాధితులకు రూ. కోటిన్నర పైన నష్టపరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. -
పరస్పర సహకారం అవసరం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కర్నూలు (లీగల్): న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందిద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. ఇటీవల బదిలీపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జీగా నియమితులైన వెంకటనాగసుందర్‌కు బుధవారం స్థానిక న్యాయవాదుల సంఘం కార్యాలయంలో స్వాగత సభ నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విశాఖ నుంచి కర్నూలుకు వచ్చిన న్యాయమూర్తి నాగసుందర్ అభినందిస్తూ ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారో నూతన న్యాయమూర్తికి అందించాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జీ వీవీ శేషుబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా న్యాయవాదులు కేసుల పరిష్కారానికి సహకరించారని అలాగే భవిష్యత్‌లో అందరికి సహకరించాలని కోరారు. నూతన న్యాయయూర్తి వెంకటనాగసుందర్ మాట్లాడుతూ కర్నూలుకు విశాఖకు అవినాభావ సంబంధం ఉందని ఇక్కడ పని చేసిన న్యాయమూర్తులు విశాఖకు, విశాఖలో పని చేసిన వారు ఇక్కడికి బదిలీ అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి రఘురాం, సబ్ జడ్జిలు శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, గంగాభవాని, బాబు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, తిరుపతయ్య, అబ్దుల్ కరీం, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్‌అదాలత్ లక్ష్యం
జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సి.కె.గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్‌లు ఎం.బాబు, పి.రాజు, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు ఇన్సురెన్స్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 1,230 కేసులు పరిష్కారం... జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,230 కేసులు పరిష్కారం చేశారు. కర్నూలులో 298, నంద్యాల 196, ఆదోనిలో 85, నందికొట్కూరులో 54, ఆత్మకూరులో 217, ఎమ్మిగనూరులో 34, ఆలూరులో 35, డోన్‌లో 78, ఆళ్లగడ్డలో 58, పత్తికొండలో 28, కోవెలకుంట్లలో 91, బనగానపల్లెలో 56 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. -
పాత కేసులను పరిష్కరించాలి
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ కర్నూలు(లీగల్): పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టీస్ నౌషద్ అలీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వినియోగదారుల ఫోరంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, వాటి పెండింగ్ కాల పరిమితిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి అధ్యక్షురాలు ఎస్.నజీరున్నిసా పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లాలోని వినియోగదారుల సంఘాల నాయకులు, కక్షిదారులు ఆయన విజ్ఞానపత్రం ఇచ్చారు.