న్యూఢిల్లీ: పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె నియామకానికి సంబంధించి శాశ్వత హోదా కల్పించాల్సిందిగా చేసిన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు జడ్జీల శాశ్వత నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదించవచ్చు లేదా మరికొన్ని ప్రతిపాదనలు చేస్తూ తిరిగి పంపించవచ్చు. కాగా 2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైనప్పటికీ, న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.(చదవండి: తనతో పాటు ఆమెను వివస్త్రను చేయడం అసాధ్యం: హైకోర్టు )
అయితే 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారు కావడంతో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం లభించింది. కానీ శాశ్వత హోదా లభించలేదు. ఈ క్రమంలో జనవరి 20న సుప్రీంకోర్టు జస్టిస్ పుష్పను పర్మినెంట్ చేస్తూ సిఫారసు చేసింది. అయితే, అంతకుముందు రోజు శరీరాన్ని శరీరం తాకలేదు(స్కిన్-స్కిన్ టూ కాంటాక్ట్ లేదు) గనుక పోక్సో చట్టం కింద దానిని లైంగికదాడికగా పరిగణించలేమంటూ ఆమె ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే విధించింది.(చదవండి: పోక్సో చట్టంపై తీర్పులు: ఎవరీ జస్టిస్ పుష్ప గనేడివాలా?)
ఈ నేపథ్యంలో గతంలో ఆమె ఇచ్చిన మరికొన్ని తీర్పులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కొలీజియం తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అరుదైన కేసుల్లో తప్ప కొలీజియం ఈ మేరకు సిఫారసులు ఉపసంహరించుకున్న దాఖలాలు లేవు. ‘‘వ్యక్తిగతంగా ఆమెకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే న్యాయవాదిగా ఉన్న సమయంలో ఇలాంటి కేసులు వాదించిన అనుభవం ఆమెకు లేదు అనిపిస్తోంది. కాబట్టి మరింత ఎక్స్‌పోజర్ కావాలి. శిక్షణ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని సర్వోన్నత న్యాయస్థాన వర్గాలు పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment