ముంబై: భార్య టీ ఇవ్వడానికి నిరాకరించడం తనపై దాడికి ఉసిగొల్పడంగా భావించలేమని, భార్యని ఒక పశువులా చూడడం తగదని, ఆమె ఒక పశువు లేదా, ఒక వస్తువు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. టీ ఇవ్వలేదన్న కారణంతో తన భార్యపై దాడికి పాల్పడిన 35 ఏళ్ళ సంతోష్ అట్కర్‌కి 2016లో స్థానిక పంధార్‌పూర్ కోర్టు విధించిన 10 ఏళ్ళ జైలు శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. ‘‘వివాహం సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యమని’’అని జస్టిస్ రేవతి మోహిత్ డేరె జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.
పితృస్వామ్య భావజాలం, స్త్రీ పురుషుడి ఆస్తి అనే అభిప్రాయం సమాజంలో పాతుకుపోయి ఉంది. ఇదే భావన పురుషుడు తన భార్యను పశువుగా భావించేలా చేస్తోంది అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరగడానికి ముందు సంతోష్‌అట్కర్, అతని భార్య మధ్య కొంతకాలంగావిభేదాలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన రోజు డిసెంబర్ 2013న భర్తకి టీ చేసి పెట్టకుండా అట్కర్ భార్య బయటకు వెళ్లబోయింది. అంతే సదరు భర్త సుత్తితో ఆమె తలపై మోదడంతో తలకి బలమైన దెబ్బతగిలి, తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా, నేరం జరిగిన ప్రాంతాన్ని శుభ్రపరిచి, ఆమెకు స్నానం చేయించి, అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు భర్త. వారం రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన అట్కర్ భార్య ఆ తరువాత మరణించింది. అయితే భార్య టీ ఇవ్వకుండా తన భర్తను హింసకు ఉసిగొల్పిందని అట్కర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు, స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఇలాంటి కేసులు లింగ వివక్షను, అసమానతలను ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ మోహిత్ డేరె అభిప్రాయపడ్డారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళలను భర్తకు లొంగివుండేలా చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి కేసుల్లో పురుషులు భార్యలను తమ వ్యక్తిగత ఆస్తిగా భావిస్తూంటారని, భర్తలు ఏం చెపితే భార్యలు అదిచేసి తీరాలన్న భావనలో మునిగిపోయి ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. తన తండ్రి, తల్లిని కొట్టడం, ఆ తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం వీరి కుమార్తె చూసిందని కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment