ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి బాంబే హైకోర్టులో బుధవారం భారీ ఊరట దక్కింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీగా వ్యవహరించిన దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను తోసివేస్తూ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగంగా బీసీసీఐ, వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీహెచ్‌ఎల్ (దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలోకి దింపింది.
ఈ సందర్భంగా... బీసీసీఐ, డీసీహెచ్‌ఎల్ మధ్య పదేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అయితే, బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో దెక్కన్ చార్జర్స్‌ను లీగ్ నుంచి తొలగించింది. అంతేగాక ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని వేలంలో నిలిపింది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్‌ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది.
ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ థక్కర్.. గతేడాది డీసీహెచ్‌ఎల్‌కు సానుకూలంగా తీర్పునిస్తూ... రూ. 4800 కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జీఎస్ పటేల్ ధర్మాసనం.. బీసీసీఐకి ఊరట కల్పిస్తూ ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసివేస్తూ తీర్పునిచ్చింది. ఇక 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment