ముంబై: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరగాల్సిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ఈసారి నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్గత సమాచారం ప్రకారం ఈ టోర్నీని వాయిదా వేయనున్నారు. భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఎవరూ ఈ టోర్నీకి వచ్చే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా ఇప్పటికే విమానాలు రద్దు చేయగా, ఇంగ్లండ్ కూడా తమ రెడ్‌లిస్ట్‌లో భారత్‌ను పెట్టింది. మహిళల చాలెంజ్ టోర్నీ వేదికగా నిర్ణయించిన న్యూఢిల్లీలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడితే తగిన అవకాశాన్ని బట్టి టోర్నీ జరగవచ్చని బోర్డు కీలక సభ్యుడొకరు వెల్లడించారు. 2019, 2020లలో మూడు జట్లు వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో గత ఏడాది 12 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment