DCHL
-
రూ. 4800 కోట్లు: బీసీసీఐకి బాంబే హైకోర్టులో భారీ ఊరట
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి బాంబే హైకోర్టులో బుధవారం భారీ ఊరట దక్కింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీగా వ్యవహరించిన దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను తోసివేస్తూ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగంగా బీసీసీఐ, వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీహెచ్ఎల్ (దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలోకి దింపింది. ఈ సందర్భంగా... బీసీసీఐ, డీసీహెచ్ఎల్ మధ్య పదేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అయితే, బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో దెక్కన్ చార్జర్స్‌ను లీగ్ నుంచి తొలగించింది. అంతేగాక ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని వేలంలో నిలిపింది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ థక్కర్.. గతేడాది డీసీహెచ్ఎల్కు సానుకూలంగా తీర్పునిస్తూ... రూ. 4800 కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జీఎస్ పటేల్ ధర్మాసనం.. బీసీసీఐకి ఊరట కల్పిస్తూ ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసివేస్తూ తీర్పునిచ్చింది. ఇక 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. చదవండి: WTC Final: భారత జట్టు ఇదే.. వారికి నిరాశే! -
డీసీహెచ్ఎల్ ఆస్తుల అటాచ్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు చెందిన రూ.122.15 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)– 2002 ప్రకారం బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, గుర్గావ్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్న 14 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇవి డీసీహెచ్ఎల్ ప్రమోటర్లు టి.వెంకటరాం రెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డి వారి బినామీ కంపెనీకి చెందినవని ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అటాచ్మెంట్ కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.264.56 కోట్లకు చేరింది. -
‘డీసీ’ టేకోవర్ రేసులో 9 కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్)ను టేకోవర్ చేయడానికి 9 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, బెన్నెట్–కోల్మెన్ అండ్ కో లిమిటెడ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ), ఐ ల్యాబ్స్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టీవీ 9), అడోనిస్ లిమిటెడ్, ఆర్మ్ ఇన్ఫ్రా అండ్ యుటిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్సెల్ గ్రూపు), అస్సెట్ రీస్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్, ఫ్యూచర్ గ్రామింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, శ్రేయ్ మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్–విజన్ ఇండియా ఫండ్లు ఉన్నాయి. డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియలో భాగంగా దివాలా పరిష్కార నిపుణులు (ఐఆర్పీ) మమతా బినానీ జారీ చేసిన పత్రికా ప్రకటనకు స్పందించిన ఈ కంపెనీలు ఆసక్తిని తెలియపరిచాయి. అలాగే డీసీహెచ్ఎల్ ఆస్తుల మదింపు కోసం శుభ సిండికేట్, సర్వెల్ కృష్ణా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను నియమించారు. ప్రముఖ ఆడిట్ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్‌ను సలహాదారుగా రుణదాతల కమిటీ నియమించింది. ఈ వివరాలతోపాటు డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ మమతా బినానీ ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన ఎన్సీఎల్టీ సభ్యులు విత్తనాల రాజేశ్వర్‌రావు.. పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు మరింత గడువునిచ్చారు. తమ వద్ద తీసుకున్న రుణాన్ని డీసీహెచ్ఎల్ తిరిగి చెల్లించలేదని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కెనరా బ్యాంకు గతేడాది ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్ ద్వారానే కార్యకలాపాలు
డెక్కన్ క్రానికల్‌కు డీఆర్టీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) సంస్థ ఆర్థిక వ్యవహారాలు, ప్రకటనలు, సర్క్యులేషన్ ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలన్నీ యాక్సిస్ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) డీసీహెచ్ఎల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే డీసీహెచ్ఎల్ ఇతర బ్యాంకుల్లో నిర్వహిస్తున్న కరెంటు ఖాతాల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రవీణరెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తమ బ్యాంకు నుంచి డీసీహెచ్ఎల్ తీసుకున్న రూ.430 కోట్ల రుణం వసూలు కోసం యాక్సిస్ బ్యాంకు గతంలో డీఆర్టీని ఆశ్రయించింది. ఇందులో భాగంగా డీసీహెచ్ఎల్ ఆర్థిక కార్యకలాపాలన్నీ తమ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఇటీవల మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అప్పులేని బ్యాంకుల ద్వారానే ఆదాయ, వ్యయాల ఖాతాలను డీసీహెచ్ఎల్ నిర్వహిస్తోందని, అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లోనే ఆదాయ, వ్యయాల ఖాతాలు నిర్వహించాల్సి ఉందని యాక్సిస్ బ్యాంకు డీఆర్టీకి నివేదించింది. ఈనెల 19న ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో డీసీహెచ్ఎల్ కౌంటర్ దాఖలు చేయకపోగా, ఆ సంస్థ తరఫున న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీచేస్తూ ప్రధాన పిటిషన్‌పై విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. -
ఈక్విటీగా డీసీ రుణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) వాటిని తీర్చడానికి ఈక్విటీ మార్గాన్ని ఎంచుకుంది. శ్రేయి ఇన్ఫ్రా నుంచి తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియను చర్చించడానికి ముగ్గురు డెరైక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద శ్రేయి ఇన్‌ఫ్రాకి షేర్లను కేటాయిస్తామని, కానీ దీనికి సంబంధించిన ఒప్పందాలు, తుది అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది. కానీ తీసుకున్న రుణం విలువను మాత్రం డీసీహెచ్ఎల్ తెలియచేయలేదు. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రూ.220 కోట్లు స్వల్ప కాలిక రుణం ఇచ్చినట్లు గతంలో తెలిపారు. రుణాన్ని ఈక్విటీగా మార్చమని శ్రేయి ఇన్ఫ్రా నుంచి వచ్చిన ప్రతిపాదనను బోర్డు పరిగణనలోకి తీసుకొని ముగ్గురు డెరైక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. డిసెంబర్, 2013 నాటికి డీసీహెచ్ఎల్లో ప్రమోటర్ల వాటా 32.66 శాతంగా ఉండగా, డీఐఐల వాటా స్వల్పంగా తగ్గి 8.17 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఇతర షేర్‌హోల్డర్ల వాటా స్వల్పంగా పెరిగి 59.10 శాతానికి చేరింది. ఆడిట్ కమిటీ సిఫార్సుల మేరకు జాయింట్ ఆడిటర్‌ను నిమమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆడిటర్ ఎంపిక బాధ్యతను ముగ్గురు డెరైక్టర్ల కమిటీకి అప్పజెప్పింది. ఇందుకోసం దేశంలోని ఆరు ప్రధాన ఆడిటింగ్ సంస్థలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.3.74 వద్ద ముగిసింది. -
సుప్రీంలో డీసీకి చుక్కెదురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రింటింగ్ ప్రెస్ ఖాళీ చేయడానికి సంబంధించిన కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్ఎల్)కి దేశ అత్యు న్నత న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయమంటూ డీసీహెచ్ఎల్ వేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వద్ద తీసుకున్న రూ.110 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను ఫిబ్రవరి 28, 2014 కల్లా డీసీహెచ్ఎల్ ఖాళీ చేయాలంటూ రాష్ర్ట హైకోర్టు నవంబర్ 11న తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ డీసీహెచ్ఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోటక్ బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు పార్టీలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో విచారణకు స్వీకరించదగ్గ అర్హత ఈ కేసుకు లేదని కోటక్ బ్యాంక్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ బి.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేసును ఉపసంహరించుకోమని డీసీహెచ్ఎల్ను కోరగా అందుకు డీసీహెచ్ఎల్ ఆమోదం తెలిపింది. అంతక్రితం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సవరణలు కోరుతో తిరిగి అదే కోర్టును ఆశ్రయించేలా డీసీహెచ్ఎల్కు సుప్రీం కోర్టు వీలుకల్పించింది. -
వేలానికి డీసీ ట్రేడ్‌మార్క్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తామిచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు(డీసీహెచ్ఎల్) చెందిన ఆస్తులను విక్రయించడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా డీసీహెచ్ఎల్కు చెందిన డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్ మార్క్‌లను విక్రయించాలని ఐడీబీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ట్రేడ్ మార్క్‌లను దక్కించుకోవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనవవచ్చని ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నాలుగు ట్రేడ్ మార్క్‌లను తనఖా పెట్టుకొని 2011లో ఐడీబీఐ బ్యాంకు రూ.250 కోట్ల రుణాన్ని డీసీహెచ్ఎల్కు మంజూరు చేసింది. ఆ మొత్తం వడ్డీతో కలిసి రూ. 297 కోట్లకు చేరింది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్‌లను ఇతరులకు విక్రయించాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. అధిక ధర ఆఫర్ చేసే వారికి వీటిని విక్రయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. డీఆర్టీలో పిటిషన్ ఇదిలా ఉండగా, డీసీహెచ్ఎల్ తీసుకున్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టుకునేందుకు వీలుగా ఆ సంస్థకు చెందిన నాలుగు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐడీబీఐ బ్యాంకు ముంబై శాఖ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం డీఆర్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.