ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు బాంబు హైకోర్టులో చుక్కెదురైంది. తమను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీస్ అధికారిపై దాడి చేశారంటూ నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సందర్భంగా నవనీత్ కౌర్ దంపతుల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. కాగా ముంబైలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఇంటి ముందు హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ రానా దంపతులు ప్రకటించిన నేపథ్యంలో నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నవనీత్ కౌర్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేస్తూ.. ఎంపీ దంపతులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఓ వ్యక్తి నివాసం వద్ద లేదా బహిరంగ ప్రదేశంలో మతపరమైన శ్లోకాలను పఠిస్తామంటూ ప్రకటించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది. అదే విధంగా ఒక నిర్ధిష్ట మతపరమైన ప్రవచనాలు బహిరంగ ప్రదేశాల్లో పఠిస్తామని ప్రకటించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమేనని తెలిపింది.
చదవండి: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ఇదిలా ఉండగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధినేత, ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు రాజ్ ఠాక్రే.. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్రానికి అల్టిమేటం ఇవ్వడంతో మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. మే 3లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే అజాన్ సమయంలో హనుమాన్ చాలీసా వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణా ప్రకటన చేశారు. దాంతో ఆగ్రహం చెందిన శివసేన కార్యకర్తలు ఖార్‌లోని నవనీత్ రాణా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.
హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నవీనీత్ రాణా దంపతులను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నవనీత్ కౌర్‌ను ముంబైలోని బైకుల్లా జైలుకు ఆమె భర్తను న్యూ ముంబైలోని తలోజా జైల్‌కు తరలించారు
Comments
Please login to add a commentAdd a comment