ముంబై: ఇంట్లో పనులు చేయాలని వివాహితను ఆమె కుటుంబ సభ్యులు ఆదేశించడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఇంట్లో వివాహిత చేసే పనులు పనిమనిషి చేసే పనులతో సమానం కాదని వెల్లడించింది. ఇంట్లో కుటుంబం కోసం పనులు చేయాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ పెట్టిన కేసు(ఎఫ్‌ఐఆర్)ను న్యాయమూర్తులు జస్టిస్ విభా కంకాన్‌వాడీ, జస్టిస్ రాజేశ్ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నెల 21న కొట్టివేసింది.
పెళ్లయ్యాక కేవలం నెల రోజుల పాటు తనను చక్కగా ఆదరించారని, ఆ తర్వాత ఒక పనిమనిషిలా మార్చారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రూ.4 లక్షలతోపాటు ఒక కారు ఇవ్వాలంటూ భర్త, అత్తమామలు డిమాండ్ చేశారని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని వెల్లడించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మహిళ భర్త, అత్తమామలు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ‘‘ఇంట్లో వివాహితను పనులు చేయాలనడం కుటుంబం కోసమే కదా. ఇంటి మనిషికి పనులు చెప్పడం పనిమనిషిని ఆదేశించినట్లు కాదు. ఇకవేళ ఆమెకు ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఆ విషయం చెప్పాలి. అప్పుడు పెళ్లికొడుకు ఆ పెళ్లి విషయంలో పునరాలోచించుకొనే అవకాశం ఉంటుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. శారీరకంగా, మానసికంగా వేధించారంటూ కేవలం నోటిమాటగా చెబితే సరిపోదని, అందుకు ఆధారాలు చూపాలని, తగిన వివరణ ఇవ్వాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment