Bombay High Court: Granted Bail To Aryan Khan - Sakshi
Sakshi News home page

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌

Published Fri, Oct 29 2021 5:26 AM | Last Updated on Sat, Oct 30 2021 11:33 AM

Bombay High Court on granted bail to Aryan Khan - Sakshi

ఆర్యన్‌ బెయిల్‌కు కృషి చేసిన లాయర్ల బృందంతో తన నివాసంలో షారుక్‌ఖాన్‌ సంతోషం

ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్‌లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఆర్యన్‌ఖాన్‌ అరెస్టయిన 25 రోజులు తర్వాత అతనికి బెయిల్‌ మంజూరు  చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ డబ్ల్యూ సాంబ్రే  గురువారం తీర్పు చెప్పారు.

ఆర్యన్‌ సహ నిందితులు అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచాలకు కూడా బెయిల్‌ మంజూరు చేశారు. ‘‘వారి ముగ్గురి బెయిల్‌ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను. శుక్రవారం సాయంత్రానికి వివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాను’’ జస్టిస్‌ సాంబ్రే చెప్పారు. ఇంకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో  శుక్రవారం లేదంటే శనివారంనాడు ఆర్యన్‌ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.  

వాదనలు సాగిందిలా..
ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు సాగాయి. ఇప్పటికే రెండుసార్లు ఆర్యన్‌కు కింది కోర్టుల్లో చుక్కెదురు కావడంతో మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని లాయర్‌గా నియమించారు. క్రూయిజ్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసినప్పుడు ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదు. ఈ విషయాన్నే ఆయన తరఫున వాదించిన ముకుల్‌ రోహత్గీ పదే పదే ప్రస్తావించారు.

వైద్య పరీక్షల్లో కూడా ఆర్యన్‌ డ్రగ్స్‌ సేవించాడనేది రుజువు కాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు ఆర్యన్‌ను అదుపులోనికి తీసుకోవడం అర్థరహితమని వాదించారు. రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్‌ సంభాషణలను ఆధారం చేసుకొని ఆర్యన్‌ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశారని, కానీ ఆ సంభాషణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. 

అర్బాజ్‌ ధరించిన షూలో డ్రగ్స్‌ లభిస్తే ఆర్యన్‌ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని రోహత్గీ తన వాదనల్లో గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్‌సీబీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ ఆర్యన్‌ ఖాన్‌ మాదకద్రవ్యాలను తరచుగా సేవిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్యన్‌ అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేసి సేవిస్తున్నారని తన వాదనల్లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌కి సంబంధాలున్నాయని అనిల్‌ సింగ్‌ ఆరోపించారు.

డ్రగ్స్‌తో వ్యాపారం చేసే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆర్యన్‌ కొనుగోలు చేస్తున్నాడని అతని వాట్సాప్‌ సంభాషణల ద్వారా తేటతెల్లమవుతోందని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందని అందుకే అతనికి బెయిల్‌ ఇవ్వొద్దని అనిల్‌ సింగ్‌ వాదించారు. క్రూయిజ్‌పై దాడి జరిగిన సమయంలో ఎక్కువమంది దగ్గర వివిధ రకాల మాదకద్రవ్యాలు లభించాయని వీటన్నింటినీ చూస్తుంటే ఆర్యన్‌ డ్రగ్స్‌ విషయం గురించి పూర్తిగా తెలుసునని ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం అన్నీ తెలిసి కూడా అక్కడ ఉండడం నేరపూరితమైన చర్యేనని వాదించారు. దీనికి రోహత్గీ గట్టిగా కౌంటర్‌ ఇస్తూ క్రూయిజ్‌లో 1,300 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాజ్‌ హోటల్‌లో 500 గదులుంటే, రెండు గదుల్లో ఉన్న వారు డ్రగ్స్‌ సేవిస్తే మొత్తం హోటల్‌లో ఉన్న వారందరినీ అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్యన్‌ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని, ఒక నవ యువకుడ్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ పకడ్బందీగా వాదనలు వినిపించారు.


లాయర్‌ రోహత్గీ వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికీ బెయిల్‌ ఇస్తానని ప్రకటించి, తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్యన్‌కు బెయిల్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ‘‘సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా’’..అంటూ స్పందించగా, ‘‘నాకిది చాలా సాధారణమైన కేసు. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ ఆర్యన్‌కు బెయిల్‌ రావడం సంతోషంగా ఉందని సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రొహత్గీ అన్నారు. న్యాయం జరగాల్సిన సమయం వస్తే, సాక్ష్యాలతో పని ఉండదు అని నటుడు సోనూసూద్‌ పేర్కొనగా ‘‘అంతా దేవుడి దయ. ఒక తండ్రిగా ఊపిరిపీల్చుకుంటున్నాను. ఇక వాళ్లకి అంతా మంచే జరగాలి’’అని మరో నటుడు ఆర్‌.మాధవన్‌ ఆకాంక్షించారు.  

2018 నాటి చీటింగ్‌ కేసులో గోసవి అరెస్ట్‌
పుణె: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సాక్షిగా ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కిరణ్‌ గోసవిని గురువారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు.  2018లో అతడిపై నమోదైన చీటింగ్‌ కేసుకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న గోసవి పోలీసులకు లొంగిపోకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ వస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు.

ఆ తరవాత అతనిని పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడైన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడే ఆర్యన్‌తో కలిసి గోసవి దిగిన సెల్ఫీలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 2018లో గోసవిపై నమోదైన చీటింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పుణె పోలీసు కమిషనర్‌ అమితాబ్‌ గుప్తా వెల్లడించారు. కత్రజ్‌ ప్రాంతంలోని ఒక లాడ్జిలో తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. సచిన్‌ పాటిల్‌ పేరుతో అతడు ఆ హోటల్‌లో ఉంటున్నాడు.    

నోటీసులివ్వకుండా వాంఖెడేని అరెస్ట్‌ చేయం
ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ముడుపులు డిమాండ్‌ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేకి మూడు రోజుల ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేయమని ముంబై పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు తనని అరెస్ట్‌ చేస్తారన్న భయం వెంటాడుతోందంటూ వాంఖెడే కోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ వాంఖెడే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నితిన్‌ జమ్‌దార్, జస్టిస్‌ ఎస్‌వి కొత్వాల్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది.

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, ముంబై పోలీసులు ఈ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందని వాంఖెడే ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అరుణ ముందస్తు నోటీసు లేకుండా వాంఖెడేని అరెస్ట్‌ చేయరని స్పష్టం చేశారు. మరోవైపు తమ కుటుంబంపైనా, వ్యక్తిగత జీవితంపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాంఖెడే భార్య క్రాంతి రేడ్కర్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఆమె ఆ లేఖలో కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement