‘ఆ కుర్రాడికి సీటు ఇవ్వకుంటే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే!’ | Supreme Court bench mark Orders Opening IIT Gates To Dalit Boy | Sakshi
Sakshi News home page

సుప్రీం బెంచ్‌ మార్క్‌ తీర్పు.. ఆర్టికల్‌ 142 ప్రయోగం! సర్వత్రా హర్షం

Published Tue, Nov 23 2021 10:40 AM | Last Updated on Tue, Nov 23 2021 11:35 AM

Supreme Court bench mark Orders Opening IIT Gates To Dalit Boy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Dalit Boy IIT Seat Case: విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ దళిత బాలుడికి సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడం, కింది న్యాయస్థానంలో పిటిషన్‌ తిరస్కరణకు గురికావడంపై విచారం వ్యక్తం చేసిన కోర్టు.. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ బెంచ్‌ మార్క్‌ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 


ఉత్తర ప్రదేశ్‌ ఘజియాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్‌ జైబీర్‌సింగ్‌.. 2021 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో 25, 894వ ర్యాంక్‌(ఎస్సీ కేటగిరీలో 864) సాధించాడు. కౌన్సెలింగ్‌లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్‌ పెట్టుకున్నాడు.  ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న మొదటి వ్యక్తి కూడా ఈ కుర్రాడే. దీంతో ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సీటు పేమెంట్‌ రూ. 15వేలను చివరి నిమిషంలో చెల్లించాడతను. తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్‌ జరగకపోవడంతో అతనికి సీటు అలాట్‌ కాలేదు. ఈ సమస్యపై  కౌన్సిలింగ్‌ జరిగిన ఖరగ్‌పూర్‌ ఐఐటీని వెంటనే ఆశ్రయించిన లాభం లేకపోయింది.


బాంబే ఐఐటీ

దీంతో ప్రిన్స్‌, బాంబే హైకోర్టు లో ప్లీ దాఖలు చేయగా.. కోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బోపన్న ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘జరిగింది సాంకేతిక తప్పిదం. విద్యార్థి తప్పేం లేదు.  పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లం అవుతాం. తక్షణమే బాంబే ఐఐటీలో అతనికి సీటు కేటాయించాలి. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి.  48 గంటల్లో అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని Joint Seat Allocation Authority (JOSAA)ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఇక రాజ్యాంగంలోని 142 ఆర్టికల్‌ అంటే.. పూర్తి న్యాయం జరిగేలా చూడడం కోసం తమ విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు.. అవి పాటించి తీరాల్సిందే!(కొన్ని సందర్భాలు మినహాయించి). ఈ ఆర్టికల్‌ను తెరపైకి తెచ్చిన బెంచ్‌.. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆల్లోకేషన్‌ ఆథారిటీని ఆదేశించింది. ఇక కౌన్సిలింగ్‌ల సమయంలో టెక్నికల్‌ సమస్యలతో ఎంతో మంది విద్యార్థులు మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటిది ఇలాంటి తీర్పులు అర్హత ఉన్న కొందరికైనా న్యాయం అందేలా చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement