ముంబై: శత్రువును అంతంచేయాలంటే సరిహద్దు దాటి మన భూభాగంలోకి వచ్చేదాకా ఆగుతానంటే కుదరదని, దూకుడుగా ముందుకెళ్లి ‘సర్జికల్’ దాడి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. కరోనా వైరస్ విస్తృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం దుందుడుకు వైఖరితో కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని బాంబే హైకోర్టు ఉపదేశించింది. వైరస్ వాహకుడైన వ్యక్తి కోవిడ్ టీకా కేంద్రానికొచ్చేదాకా ప్రభుత్వం వేచిచూస్తా నంటే కుదరదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వమే ‘ఇంటికి దగ్గర్లోనే’ టీకా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని హైకోర్టు సూచించింది.
ఇళ్లకే వెళ్లి కోవిడ్ టీకా
75 ఏళ్ల వయసు పైబడిన వారు, ముఖ్యంగా వికలాంగులు, మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన నిస్సహాయులకు వారి ఇళ్లకే వెళ్లి కోవిడ్ టీకా వేయాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ధృతి కపాడియా, కునాల్ తివారీ అనే న్యాయవాదులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఈ పిల్‌ను బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల డివిజిన్ బెంచ్ బుధవారం విచారించింది.
కరోనా మనందరి ఉమ్మడి అతిపెద్ద శత్రువు
‘కరోనా మనందరి ఉమ్మడి అతిపెద్ద శత్రువు. మనందరం వీలైనంత త్వరగా వైరస్ ఉధృతిని ఆపాలి. కొన్ని ప్రాంతాల్లో వైరస్ విజృంభణ ఎక్కువై, అక్కడి ప్రజలు(వృద్ధులు, తదితరులు) కోవిడ్ కేంద్రాల దాకా రాలేని పరిస్థితులున్నాయి. సర్జికల్ దాడి తరహాలోనే మన కోవిడ్ అదుపు విధానం ఉండాలి. మీరు సరిహద్దు(కోవిడ్ కేంద్రం) వద్ద నిలబడి కరోనా వాహకుడి కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లోకి వెళ్లట్లేరు. మీరే అక్కడికెళ్లి అంతంచేయాలి’ అని సీజే దత్తా అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోందని, కానీ నిర్ణయాల అమలులో తీవ్ర జాప్యం కారణంగా ఎన్నో ప్రాణాలను పోగొట్టుకుంటున్నామని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఇంటికి దగ్గర్లో టీకా కేంద్రం
ఇంటింటికీ టీకా కార్యక్రమం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యంకాదని, ‘ఇంటికి దగ్గర్లో టీకా కేంద్రం’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించ నున్నామని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందించింది. ‘కేరళ, జమ్మూ కశ్మీర్, బిహార్, ఒడిశా రాష్ట్రాలుసహా మహారాష్ట్రలోని వసాయ్–విహార్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో డోర్–టు–డోర్ వ్యాక్సినేషన్ అమల్లో ఉంది. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లో మీరెందుకు ప్రోత్సహించట్లేరు? కేంద్రం నుంచి అనుమతులొచ్చే దాకా వారేమీ డోర్–టు–డోర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టకుండా ఆగలేదు కదా’ అని హైకోర్టు ఉదహరించింది.
(చదవండి: ముంబైని ముంచెత్తిన వర్షాలు )
Bombay HC: కరోనా మనందరి అతిపెద్ద శత్రువు.. సర్జికల్ దాడి చేయాల్సిందే!
Published Thu, Jun 10 2021 8:37 AM | Last Updated on Thu, Jun 10 2021 8:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment