
ముంబై: దేశవ్యాప్తంగా ఎంతోమంది అండర్ ట్రయల్ ఖైదీలు అనేక ఏళ్లపాటు జైళ్లలోనే మగ్గిపోతున్నారని బాంబే హైకోర్టు పేర్కొంది. విలువైన వారి జీవిత కాలం విచారణ కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోందని వెల్లడించింది. ఈ విషయంలో గిరిజన హక్కుల ఉద్యమకారుడు దివంగత స్టాన్ స్వామి చేసిన కృషిని న్యాయస్థానం ప్రశంసించింది. విచారణ లేకుండా అండర్ ట్రయల్ ఖైదీలను ఎన్నాళ్లపాటు జైళ్లకే పరిమితం చేస్తారని ప్రభుత్వాలను ప్రశ్నించింది.
ఇలాంటి ఖైదీలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ స్టాన్ స్వామి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. స్టాన్ స్వామి అద్భుతమైన వ్యక్తి అని, సమాజానికి గొప్ప సేవలు అందించారని కొనియాడింది. ఆయన సేవల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంది. చట్టపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు ఉండొచ్చు.. కానీ, అది వేరే విషయం అని తెలిపింది. స్టాన్ స్వామి కస్టడీలోనే చనిపోతారని ఊహించలేదంది.
ఎల్గార్ పరిషత్– మావోయిస్టులతో సంబంధాల కేసులో స్టాన్ స్వామిని 2020 అక్టోబర్‌లో రాంచీలో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉండగానే స్టాన్ స్వామి ఇటీవల మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment