ముంబై: లైంగికదాడి కేసులో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా ఇచ్చిన మరో సంచలన తీర్పు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి పద్దెమినిదేళ్లు నిండలేదని ఆమె తల్లి చెబుతున్న మాటలకు, జన్మధ్రువీకరణ పత్రానికి పొంతన లేదని, కాబట్టి నిందితుడికి పదేళ్ల శిక్ష విధించడం అన్యాయం అంటూ అతడిని నిర్దోషిగా ప్రకటించారు. ‘‘ఓ వ్యక్తి బాధితురాలిని బలవంతంగా బంధించి, ఆమె నోట్లో వస్త్రాలు కుక్కి, ఒకేసారి ఇరువురి దుస్తులు విప్పదీయడం.. అది కూడా ఎలాంటి ఘర్షణ లేకుండానా? ఇది అసాధ్యం’’అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వివరాలు... సూరజ్ కసార్కర్(26) అనే వ్యక్తి తన పదిహేనేళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేశాడని అతడి పొరుగింటి మహిళ 2013, జూలై 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. యావత్మల్‌కు చెందిన అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో స్పెషల్ ట్రయల్ కోర్టు అతడు నేరానికి పాల్పడ్డట్లు రుజువుకావడంతో శిక్ష ఖరారు చేసింది. అయితే బాధితురాలు మేజర్ అని, ఇద్దరి అంగీకారంతోనే శారీరకంగా ఒక్కటయ్యారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. బాధితురాలు మాత్రం.. ‘‘ఆరోజు రాత్రి 9.30 గంటల సమయంలో నేను ఇంట్లో ఉన్న సమయంలో సూరజ్ లోపలికి వచ్చి బలత్కారం చేశాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. నా తమ్ముడేమో నిద్రపోతున్నాడు. మా అమ్మ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. అరవడానికి ప్రయత్నించగా.. నా నోటిని గట్టిగా మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయం అమ్మకు చెప్పాను. తర్వాత ఇద్దరం పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశాం’’ అని కోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలో అనేక విచారణల అనంతరం కేసు హైకోర్టుకు చేరింది.(చదవండి: సంచలన తీర్పులు: జస్టిస్ పుష్ప గనేడివాలా నేపథ్యం?!)
ఈ క్రమంలో ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పుష్ప గనేడివాలా.. ‘‘బాధితురాలు వర్ణించిన విధానం సహజంగా లేదు. ఒకవేళ ఆమె చెప్పినట్లు బలవంతం జరిగి ఉంటే ఇరువురి మధ్య గొడవ జరగాలి. కానీ మెడికల్ రిపోర్టులో, బాధితురాలికి గాయాలు అయినట్లు గానీ, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. పరస్పర అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బాధితురాలు సైతం.. ‘‘మా అమ్మ రాకపోయి ఉంటే, నేను ఫిర్యాదు చేసేదాన్ని కాదని క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చెప్పింది’’ అని చెప్పింది.(చదవండి: ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు)
చట్టానికి బలమైన సాక్షాధారాలు అవసరం. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలమే నిందితుడికి శిక్ష వేయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే అప్పీలు చేసుకున్న వ్యక్తిని 10 ఏళ్లపాటు జైలుకు పంపడం అన్యాయమే అవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా శరీరానికి శరీరం తగిలితేనే పోక్సో చట్టం కింద నేరంగా పరిగణిస్తామని, అదే విధంగా ఐదేళ్ల బాలిక చేతులు పట్టుకుని, ప్యాంటు జిప్ తెరచినంత మాత్రాన దానిని లైంగిక చర్యగా పేర్కొనలేమంటూ జస్టిస్ పుష్ప ఇటీవల తీర్పులు వెలువరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment