ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment