సాక్షి, హైదరాబాద్: అడవుల్లో పట్టుకోల్పోతున్నాం.. కంచుకోటలనుకున్న ప్రాంతాలపై పట్టు సడలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంతాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇదీ 14 ఏళ్లకు ముందే మావోయిస్టులు, వారి సిద్ధాంతకర్తల మధ్య జరిగిన మేధోమథనం. ఇందులో నుంచి పుట్టిందే ‘అర్బన్ మావోయిజం’. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న సంఘటిత, అసంఘటిత వర్గాలను ఏకంచేసి ఉద్యమాలు నిర్వహించడమే ఈ వ్యూహం. 14 ఏళ్ల క్రితం మావో యిస్టులు రచించిన ఈ వ్యూహం.. గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది.
ఈ విషయం మాత్రం పోలీసుల రాడార్‌లోకి వచ్చింది ఈ ఏడాది జనవరిలోనే. భీమా–కోరేగావ్ ఘటన తర్వాత మహారాష్ట్ర పోలీసుల విచారణలో వెల్లడైన ఈ ‘గోల్డెన్ కారిడార్’వ్యవహారం.. ఏపీ, తెలంగాణ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మావోయిస్టులంటే అడువుల్లోనే ఉండాలి.. పోలీసులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయాలన్న ఆలోచననుంచి కాస్త విభిన్నంగా.. నగరాలు, పట్టణాల్లో సైతం ఉద్యమాల నిర్వహణకు కార్యరూపం దాలుస్తున్నట్టు వరుసగా అర్బన్ మావోయిస్టుల అరెస్టులతో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారంలో జరిగిన వరుస అరెస్టులతో.. పోలీస్ శాఖకు స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
అర్బన్ మావోయిజం
మావోయిస్టు పార్టీ 2004లో తీసుకున్న కీలక నిర్ణయం అర్బన్ నక్సలిజం. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోవలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం 2018 వరకు బయటకు రాకపోవడం యావద్భారత పోలీసు వ్యవస్థను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల గుజరాత్‌లో ప్రధాని మోదీ అ«ధ్యక్షతన జరిగిన అఖిలభారత డీజీపీల సదస్సులో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
భీమా–కోరేగావ్ వ్యవ హారంలో మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని.. వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్మికులు, దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపిస్తున్నారని పుణే (మహారాష్ట్ర) పోలీసులు ఆధారాలు సేకరిం చారు. అందులో భాగంగా మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, అరుణ ఫెరీరాలపై వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటన అనంతరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. చాపకింద నీరులా అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ, విప్లవ సాహిత్యం ప్రచురణ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించింది.
‘గోల్డెన్ కారిడార్’వ్యూహంతో..
ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌చేసింది. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన వారు. వీరు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతమైన కామ్‌రాజ్‌నగర్, విక్రోలి, రాంబాయి అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ అక్కడ వలస కార్మికులుగా ఉన్న తెలంగాణ వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపించినట్టు గుర్తించారు. ఈ ఏడుగురికి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సత్సంబంధాలున్నట్లు వెల్లడైంది.
వీరి నుంచి భారీగా మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అయితే వీరంతా అర్బన్ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేస్తున్నారని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులను మావోయిస్టు పార్టీలో చేర్పించి.. ఉద్యమాలు, విధ్వంసకాండ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది.
తాజాగా.. నక్కా వెంకట్రావ్!
అర్బన్ మావోయిజం వ్యవహారం ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా సాగుతోందని గుర్తించిన నిఘా వర్గాలు.. తాజాగా మరో తెలుగు వ్యక్తి, ఎన్‌జీఆర్‌ఐ(జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో టెక్నికల్ ఉద్యోగి నక్కా వెంకట్రావ్‌ను అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన తెలంగాణ, ఆంధప్రదేశ్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. వెంకట్రావ్ నుంచి డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈయన రాడికల్ స్టూడెంట్ యానియన్‌లో 80వ దశకం నుంచే క్రియాశీలకంగా ఉన్నారని.. ఇటీవల అరెస్టయిన మావోయిస్టు కీలక నేత కుమార్ సాయి అలియాస్ పహీద్ సింగ్‌తో వెంకట్రావ్‌కు సంబంధాలున్నట్టు గుర్తించామని దుర్గ్ ఐజీ జీపీ సింగ్ స్పష్టంచేశారు. అయితే వెంకట్రావ్ జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల్లో అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్‌వర్క్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు గుర్తించారు. వరుసగా అర్బన్ మావోయిజం దేశవ్యాప్త లింకులు వెల్లడవడం.. దీనికితోడు అరెస్టయిన వారంతా తెలుగువారే కావడం ఈ రెండు రాష్ట్రాల పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది.
మన సంగతేంటి?
ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు, మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టవడంపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో పరిస్థితి ఏంటన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల వేళ అలజడులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్బన్ మావోయిజం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, జీఆర్‌డీ (గ్రామ రక్షక దళాలు), మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న పలు కమిటీల కీలక సభ్యులపై దృష్టి సారించినట్టు తెలిసింది.
యూనివర్సిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, దళిత సంఘాలు, కుల సంఘాల్లో ఉన్న కొంత మందిని ఉద్యమం వైపు ప్రేరేపించి నియామకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పీడిత, బాధిత వర్గాలను అర్బన్ మావోయిజం వైపు ఆకర్శించేదిశగా పలువురు అర్బన్ మావోయిస్టు మేధావులు పనిచేస్తున్నారని.. వారిపైనా నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో పేర్కొన్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ వ్యవహారం కొంత ఆందోళన పెడుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment